ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు... షెడ్యూల్ విడుదల చేసిన నిమ్మగడ్డ 

08-01-2021 Fri 22:14
  • నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు
  • ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 4 వరకు నోటిఫికేషన్లు
  • ఫిబ్రవరి 5 నుంచి 17వ తేదీ వరకు ఎన్నికలు
  • ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్
Nimmagadda Ramesh Kumar releases schedule for Panchayat elections in AP

హైకోర్టు సూచనల మేరకు ఇవాళ రాష్ట్ర సీఎస్ ఆదిత్యనాథ్, ఇతర అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో జరిపిన చర్చలు ఏమాత్రం ఫలప్రదం కాలేదు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ స్పష్టం చేసినప్పటికీ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తమ నిర్ణయానికి కట్టుబడుతూ సంచలనాత్మక రీతిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు.

నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ నెల 23, 27, 31, ఫిబ్రవరి 4వ తేదీన వరుసగా ఒక్కో దశకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వివరించారు. ఆపై, ఫిబ్రవరి 5, 7, 9, 17న దశల వారీగా  ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. చివరి దశ పోలింగ్ రోజునే సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు.

కాగా, షెడ్యూల్ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ ను సాకుగా చూపుతూ రాష్ట్ర సర్కారు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలనుకుంటోందని, కరోనాతో తీవ్రస్థాయిలో ప్రభావితమైన అమెరికాలోనే ఎన్నికలు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. మన రాష్ట్రంలో అంతటి దారుణమైన పరిస్థితులు లేవని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు జరపాలన్న నిర్ణయం తీసుకునేముందు తాము ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని స్పష్టం చేశారు. అయితే ఏవైనా పథకాలు ప్రారంభించే ముందు ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.