విగ్రహాల ధ్వంసం ఘటనలపై సిట్ దర్యాప్తు... ఏపీ సర్కారు కీలక నిర్ణయం

08-01-2021 Fri 21:57
  • కొన్నిరోజుల కిందట సీఐడీకి అప్పగించిన సర్కారు
  • తాజాగా 16 మందితో సిట్ ఏర్పాటు
  • సిట్ చీఫ్ గా జీవీజీ అశోక్ కుమార్
  • ఆలయాలకు సంబంధించిన అన్ని కేసులను విచారించనున్న సిట్
SIT appointed to investigate attacks on temples in AP

రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై దర్యాప్తు బాధ్యతలను ఇటీవల సీబీసీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మనసు మార్చుకుంది. ఈ ఘటనలపై దర్యాప్తు బాధ్యతలను సీఐడీ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు బదలాయిస్తున్నట్టు ఏపీ సర్కారు ప్రకటన చేసింది.

ఈ మేరకు 16 మందితో కూడిన సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా జీవీజీ అశోక్ కుమార్ ను నియమించింది. ప్రస్తుతం అశోక్ కుమార్ ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆలయాలకు సంబంధించిన అన్ని ఘటనలను ఈ సిట్ విచారించనుంది.

కాగా, ప్రభుత్వం ఈ కేసులను సిట్ కు బదలాయించడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. తాము కోరిన విధంగా ఈ కేసులపై సిట్ ఏర్పాటు చేశారంటూ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.