పవన్ కల్యాణ్ సభకు అనుమతి ఇస్తున్నాం... నాదెండ్ల మనోహర్ కు ఫోన్ ద్వారా తెలిపిన తూర్పు గోదావరి ఎస్పీ

08-01-2021 Fri 20:44
  • జనవరి 9న కొత్తపాకల వద్ద పవన్ సభ
  • తొలుత అనుమతులు నిరాకరించిన ఎస్పీ
  • ఆగ్రహం వ్యక్తం చేసిన నాదెండ్ల మనోహర్
  • రేపు రాజమండ్రి వచ్చి తీరుతానని పవన్ స్పష్టీకరణ
  • మనసు మార్చుకుని అనుమతి ఇచ్చిన ఎస్పీ
East Godavari SP gives permission for Pawan Kalyan rally in Kotha Pakala

తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం కొత్తపాకల వద్ద రేపు జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొంటున్న బహిరంగ సభకు ఎట్టకేలకు జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. అంతకుముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పవన్ సభకు అనుమతి ఇవ్వలేమని ఎస్పీ పేర్కొనగా, జనసేన అగ్రనాయకత్వం మండిపడింది. పవన్ సభకు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ చివరి నిమిషంలో అనుమతి రద్దు చేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అటు, జనసేనాని పవన్ కల్యాణ్ సైతం, రేపు రాజమండ్రి వస్తున్నానని, కార్యక్రమాలకు హాజరవుతానని ప్రకటించగా, ఆయన ట్వీట్ చేసిన కాసేపటికే జిల్లా ఎస్పీ నుంచి అనుమతులు రావడం గమనార్హం. ఈ క్రమంలో, కొద్దిసేపటి కిందట తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ  జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ కు ఫోన్ చేసి, రేపటి సభకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. తుని నియోజకవర్గంలో దివిస్ ల్యాబరేటరీస్ సంస్థ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారికి మద్దతుగా రేపు పవన్ కల్యాణ్ బహిరంగ సభలో పాల్గొంటున్నారు.