FFI: థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వండి... కేంద్రాన్ని కోరిన ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.థాను

  • ఇటీవల తమిళనాడులో 100 శాతం సీటింగ్ కు అనుమతి
  • అనుమతి వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశించిన కేంద్రం
  • 50 శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు నిర్వహించలేమన్న థాను
  • పండుగ సీజన్ లోనైనా 100 ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి
Film Federation Of India writes Centre to hundred percent occupancy in theaters

ఇటీవల తమిళనాడు ప్రభుత్వం సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు 100 శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చంటూ ఉత్తర్వులు జారీ చేయగా, ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రం వెంటనే ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీనిపై ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడు, ప్రముఖ దక్షిణాది నిర్మాత 'కలైపులి' ఎస్. థాను కేంద్రానికి లేఖ రాశారు. తన లేఖ ప్రతులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ లకు పంపారు.

కరోనా ప్రభావంతో చిత్ర పరిశ్రమకు, థియేటర్ల యాజమాన్యానికి జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుందని, 50 శాతం ఆక్యుపెన్సీతో ఆ నష్టాలు పూడ్చుకోవడం అయ్యేపని కాదని వివరించారు. బస్సులు, విమానాల్లో 100 శాతం ప్రయాణికులకు అనుమతి ఇచ్చిన కేంద్రం, సినిమా హాళ్ల విషయంలో 50 శాతం ప్రేక్షకుల పరిమితి విధించడం సబబు కాదని ఎస్.థాను తెలిపారు.

దేశం మొత్తమ్మీద అన్ని భాషల చిత్రాలు కలిపి 500 వరకు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయని, 50 శాతం ప్రేక్షకులతో ఈ సినిమాలు విడుదల చేయలేమని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు. అందుకే 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలని, కనీసం, సంక్రాంతి సీజన్, రిపబ్లిక్ డే సీజన్ సందర్భంగానైనా 100 శాతం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలకు అనుమతి మంజూరు చేయాలని థాను కేంద్రాన్ని కోరారు.

More Telugu News