బీజేపీ, వైసీపీల కుట్ర తెలిసి కూడా చంద్రబాబు క్రైస్తవ మతంపై వ్యాఖ్యలు చేశారు: హర్షకుమార్

08-01-2021 Fri 19:27
  • విగ్రహాల ధ్వంసం కుట్రను బీజేపీ నడిపిస్తోందన్న హర్షకుమార్
  • వైసీపీ సహకరిస్తోందని ఆరోపణ
  • తిరుపతి ఉపఎన్నికలో టీడీపీకి నష్టం తప్పదని విశ్లేషణ
  • విగ్రహాల ఘటనలపై సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలని సూచన
Harsha Kumar responds on recent developments in AP

మతపరమైన అంశాలు రెచ్చగొట్టే బీజేపీకి ఏపీలో వైసీపీ లోపాయికారీగా మద్దతు అందిస్తోందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీ, వైసీపీ కుట్రలో భాగంగానే ఏపీలో విగ్రహాల ధ్వంసం జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ హిందువుల ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు.

అయితే, బీజేపీ, వైసీపీల కుట్ర సంగతి తెలిసి కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు క్రైస్తవ మతంపై వ్యాఖ్యలు చేశారని తెలిపారు. విగ్రహాల ధ్వంసం ఘటనలతో తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ ఓటు బ్యాంకు పదిలమవుతుందని, టీడీపీ నష్టపోతుందని హర్షకుమార్ విశ్లేషించారు. గతకొంతకాలంగా వైసీపీకి దూరమవుతున్న దళిత, మైనారిటీ ఓటు బ్యాంకు విగ్రహాల ధ్వంసం ఘటనలతో మళ్లీ దగ్గరైందని వివరించారు. ఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటికి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.