ఆసీస్ పై ఎవరికీ దక్కని రికార్డు సొంతం చేసుకున్న రోహిత్ శర్మ

08-01-2021 Fri 19:11
  • ఆసీస్ పై ఇప్పటిదాకా 100 సిక్సులు కొట్టిన రోహిత్
  • అన్ని ఫార్మాట్లలో సిక్సుల మోత
  • లైయన్ బౌలింగ్ లో కొట్టిన సిక్స్ తో ఘనత
  • ఓవరాల్ గా 424కి పెరిగిన రోహిత్ సిక్సులు
Rohit Sharma blasts hundred sixes against Australia in all formats

ఏడాది తర్వాత రోహిత్ శర్మ టెస్టు క్రికెట్లోకి మళ్లీ అడుగుపెట్టాడు. 2019 నవంబరులో బంగ్లాదేశ్ జట్టుతో కోల్ కతా టెస్టు తర్వాత రోహిత్ మళ్లీ ఐదు రోజుల క్రికెట్ ఆడుతోంది ఇప్పుడే. అయితే తన పునరాగమనంలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆసీస్ జట్టుపై ఎవరికీ సాధ్యం కాని ఘనతను తాను సాధించాడు. కంగారూలపై అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సిక్సర్లు బాదిన ఏకైక ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు.

ఇవాళ సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్ లో కొట్టిన సిక్సుతో హిట్ మ్యాన్ ఈ ఘనత అందుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాత ఆసీస్ పై అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో ఇయాన్ మోర్గాన్ (63), బ్రెండన్ మెకల్లమ్ (61), సచిన్ టెండూల్కర్ (60), ఎంఎస్ ధోనీ (60) ఉన్నారు.

ఇక, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో కొట్టిన సిక్సర్ల సంఖ్య 424కి పెరిగింది. ఓవరాల్ గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ కంటే ముందు క్రిస్ గేల్, షాహిద్ అఫ్రిది మాత్రమే ఉన్నారు. గేల్ 534 సిక్సులు బాదగా, అఫ్రిది 476 సిక్సర్లు సంధించాడు.