బండి సంజయ్ ను కిషన్ రెడ్డి కూడా నియంత్రించలేకపోతున్నారు: ప్రభుత్వ విప్ బాలరాజు

08-01-2021 Fri 18:04
  • బీజేపీ నేతలపై బాలరాజు వ్యాఖ్యలు
  • ఎంతసేపూ కులాలు, మతాలేనా అంటూ ఆగ్రహం
  • బండి సంజయ్ కి సిగ్గుండాలంటూ విమర్శలు
  • నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని వ్యాఖ్య 
Balaraju says Kishan Reddy can not control Bandi Sanjay

తెలంగాణ ప్రభుత్వ విప్, అచ్చంపేట్ శాసనసభ్యుడు గువ్వల బాలరాజు బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలకు ఎంతసేపూ కులాలు, మతాలేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఓ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. కులాల పేరిట హిందూయిజాన్ని చీల్చొద్దంటున్నారు... ఆ మాట మాట్లాడ్డానికి బండి సంజయ్ కి సిగ్గుండాలి అంటూ మండిపడ్డారు.  కేంద్రంలో మంత్రి పదవి ఒరగబెడుతున్న కిషన్ రెడ్డి కూడా ఆయనను నియంత్రించలేకపోతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

"ప్రధాని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఏంచేశారో చెప్పమంటే, బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. లక్ష్యం 2023 అంటున్నారు... 23 కాదు కదా, 2048 వచ్చినా బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది ఓ పగటి కల మాత్రమే. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అడ్డదారిలో అధికారంలోకి వచ్చారు. ఇక్కడ కూడా అలాగే అడ్డదారిలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు. కానీ మీకు ఎక్కడా ప్రజల మద్దతు లేదనడానికి నిన్న నిజామాబాద్ లో జరిగిన సభే నిదర్శనం. 60 లక్షల సభ్యత్వాలు ఉన్న టీఆర్ఎస్ ను చూడండి... ఓసారి మీ బలమెంతో లెక్కలు వేసుకోండి... ఇకనైనా పగటికలలు కనడం మానండి" అని గువ్వల బాలరాజు వ్యాఖ్యానించారు.