డబుల్ బెడ్రూం ఇంటిని తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసిన మహిళ... కారణం ఇదే!

08-01-2021 Fri 15:47
  • సిద్ధిపేట జిల్లాకు చెందిన లక్ష్మికి డబుల్ బెడ్రూం ఇల్లు
  • తాను, తన కుమార్తె మాత్రమే ఉంటామని లక్ష్మి వెల్లడి
  • కుమార్తెకు పెళ్లయిపోతే తానొక్కదాన్నే ఉంటానని వివరణ
  • ఒక్కదానికి డబుల్ బెడ్రూం ఇల్లెందుకన్న లక్ష్మి
  • అభినందించిన మంత్రి హరీశ్ రావు
Woman returns double bedroom house to Telangana government

సిద్ధిపేట జిల్లాకు చెందిన లక్ష్మి అనే మహిళ ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ప్రభుత్వం అందజేసిన డబుల్ బెడ్రూం ఇంటిని ఆమె తిరిగి ఇచ్చేయడమే అందుకు కారణం. ఆమె మంచి మనసుకు మెచ్చి జిల్లా కలెక్టర్ తదితరులు శాలువా కప్పి గౌరవించారు. ఇవాళ సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఇంటికి సంబంధించిన పత్రాలను ప్రభుత్వానికి అప్పగించింది. ఈ సందర్భంగా తాము డబుల్ బెడ్రూం ఇంటిని ఎందుకు తిరిగి ఇచ్చి వేస్తున్నామో లక్ష్మి వివరించింది.

ప్రస్తుతం తాను, తన కుమార్తె మాత్రమే ఉంటున్నామని, కుమార్తెకు పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోతే, తన ఒక్కదానికి డబుల్ బెడ్రూం ఇల్లు ఎందుకని పేర్కొంది. అందుకే తిరిగి ఇచ్చేస్తున్నామని, ఎవరైనా పేద కుటుంబానికి ఈ ఇల్లు ఇస్తే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లక్ష్మి అభిప్రాయపడింది. తమకు ఇల్లు కేటాయించినందుకు ఆమె మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఎంతో పెద్దమనసుతో ఆలోచించిన లక్ష్మిని మంత్రి హరీశ్ రావు మనస్ఫూర్తిగా అభినందించారు. లక్ష్మి చర్య అందరికీ ఆదర్శనీయం అని కొనియాడారు.