మంత్రి పువ్వాడ అజయ్ కు కొమ్ముకాసే అధికారులు జాగ్రత్తగా ఉండాలి: బండి సంజయ్

08-01-2021 Fri 15:29
  • సర్కారులో అవినీతి పెరిగిందన్న బండి సంజయ్
  • అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని వెల్లడి
  • మంత్రి అజయ్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
  • కబ్జాల కోసమే టీఆర్ఎస్ లోకి వచ్చారని వ్యాఖ్యలు
Bandi Sanjay criticizes minister Puvvada Ajay

అధికార టీఆర్ఎస్ పై తమ పోరాటం కొనసాగుతుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్ఘాటించారు. టీఆర్ఎస్ సర్కారులో అవినీతి రాజ్యమేలుతోందని, తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. మంత్రి పువ్వాడ అజయ్ కి కొమ్ముకాసే అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మంత్రి అజయ్ భూ కబ్జాలపై విచారణ జరిపి, జైలుకు పంపుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. వైద్య కళాశాల పేరుతో భూములు దోచుకున్న సంగతి ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. భూ కబ్జాల కోసమే ఎర్రజెండాను వదిలి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని మంత్రి అజయ్ పై ఆరోపణలు చేశారు.