చంద్రబాబుపై మరోసారి సెటైర్లు వేసిన అంబటి రాంబాబు

08-01-2021 Fri 14:52
  • వెన్నుపోటు పొడిచి జై ఎన్టీఆర్ అన్నారు
  • ఆలయాలు కూల్చి జైశ్రీరాం అన్నారు
  • అసలు మిమ్మల్ని ఏం అనాలయ్యా?
Ambati Rambabu once again targets Chandrababu

ఏపీ రాజకీయాలు ఇప్పుడు కేవలం హిందూ ఆలయాల చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై దాడులు జరగడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. రామతీర్థం వద్ద అయితే యుద్ధ వాతావరణమే నెలకొంది. చంద్రబాబు, సోము వీర్రాజుల రామతీర్థం పర్యటనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి.

మరోవైపు తమ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు అదే స్థాయిలో చెక్ పెట్టేందుకు సీఎం జగన్ కార్యాచరణ ప్రారంభించారు. టీడీపీ హయాంలో విజయవాడలో రోడ్డు వెడల్పు కోసం కూల్చివేసిన 9 దేవాలయాల పునర్నిర్మాణాలకు ఈరోజు ఆయన భూమిపూజ నిర్వహించారు. తద్వారా హిందూ మతంపై తమ ప్రభుత్వానికి ఎంతో విశ్వాసం ఉందనే సంకేతాలను ప్రజల్లోకి ఆయన పంపించే ప్రయత్నం చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుపై అంబటి రాంబాబు తనదైన శైలిలో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పొడిచి జై ఎన్టీఆర్ అన్నారని... దేవాలయాలు కూల్చి జైశ్రీరాం అన్నారని... అసలు మిమ్మల్ని ఏమనాలయ్యా? అని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ వ్యవహారంపై కూడా అంబటి సెటైర్లు వేశారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు రచ్చ చేసిన చంద్రబాబు, లోకేశ్... ఇప్పుడు అఖిలప్రియను అరెస్ట్ చేస్తే మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. ఇదే అరెస్ట్ ఏపీలో జరిగి ఉంటే చెలరేగిపోయేవాళ్లని ఎద్దేవా చేశారు.