చిరంజీవి తదుపరి సినిమాలో ప్రియమణి!

08-01-2021 Fri 14:49
  • చిరంజీవి హీరోగా 'లూసిఫర్' రీమేక్ 
  • మంజు వరియర్ పాత్రకు ప్రియమణి
  • మరో ముఖ్య పాత్రలో సత్యదేవ్
  • ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలు  
Priyamani to play key role in Chiranjeevis next

పలు తెలుగు సినిమాలలో కథానాయికగా నటించిన ప్రముఖ నటి ప్రియమణి వివాహానంతరం కూడా పలు సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తోంది. ప్రస్తుతం రానా నటిస్తున్న 'విరాటపర్వం', వెంకటేశ్ నటిస్తున్న 'నారప్ప' సినిమాలలో ముఖ్య పాత్రలలో నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి నటించే సినిమాలో ఓ కీలక పాత్రకు ప్రియమణి ఎంపికైనట్టు వార్తలొస్తున్నాయి.

మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మాతృకలో మంజు వరియర్ పోషించిన కీలక పాత్ర ఒకటుంది. ఈ పాత్రకు గాను పలువుర్ని పరిశీలించిన మీదట తాజాగా ప్రియమణిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.  

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఇందులో మరో ముఖ్య పాత్రకు సత్యదేవ్ ను ఎంపిక చేసినట్టు కూడా వార్తలొచ్చాయి. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న 'ఆచార్య' పూర్తయ్యాక, వచ్చే నెలలో దీని షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.