మంత్రి అప్పలరాజుపై అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఫైర్

08-01-2021 Fri 14:33
  • గౌతు లచ్చన్నపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అప్పలరాజు
  • లచ్చన్నలాంటి వారి వల్లే అప్పలరాజు వంటి వారు మంత్రులయ్యారన్న అచ్చెన్న
  • లచ్చన్న చరిత్ర ఏమిటో తెలుసుకోవాలన్న రామ్మోహన్ నాయుడు
Atchannaidu fires on Appalaraju

స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న గురించి ఏపీ మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పలరాజుపై టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. లచ్చన్న వంటి మహనీయుల వల్లే అప్పలరాజు వంటి వారు మంత్రులయ్యారని అచ్చెన్నాయుడు అన్నారు. చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పి ఉంటే మంత్రికి గౌరవం పెరిగేదని అన్నారు.

అనుమతులు లేకుండా వైయస్ విగ్రహాలను వీధుల్లో పెట్టారని... అయినప్పటికీ, తమ ప్రభుత్వ హయాంలో వాటిని తొలగించే ప్రయత్నాన్ని తాము చేయలేదని అచ్చెన్న చెప్పారు. ఈ 19 నెలల కాలంలో పలాసకు అప్పలరాజు చేసిందేమిటని ప్రశ్నించారు. కేవలం అవినీతికి, బెదిరింపులకు మాత్రమే ఆయన మంత్రి పదవిని వాడుకుంటున్నారని చెప్పారు. తాము కూడా కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే అప్పలరాజు అనే వ్యక్తి ఇప్పుడు ఉండేవాడా? అని ప్రశ్నించారు. టీడీపీ అంటేనే పలాస డీఎస్పీ అంతెత్తున లేస్తున్నాడని దుయ్యబట్టారు.

రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ లచ్చన్న అందరివాడని అన్నారు. అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అప్పలరాజు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. సంస్కారం లేకుండా మంత్రి ప్రవర్తించారని విమర్శించారు. అప్పలరాజు కనుసన్నల్లో పలాసలో భూకబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గౌతు లచ్చన్న చరిత్ర ఏమిటో మంత్రి తెలుసుకోవాలని అన్నారు. అప్పలరాజు వల్ల ఈ ప్రాంతానికి చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు.