హిందూపురంను జిల్లాగా ప్రకటించాలి... అవసరమైతే సీఎంను కలుస్తా: బాలకృష్ణ

08-01-2021 Fri 14:32
  • హిందూపురంలో కొనసాగుతున్న పర్యటన
  • రైతులను కలుస్తున్న బాలకృష్ణ
  • మరోసారి హిందూపురం జిల్లా అంశాన్ని ప్రస్తావించిన వైనం
  • గతంలో సీఎం జగన్ కు లేఖ
TDP MLA Balakrishna demands Hindupur district

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్నిరోజులుగా ఆయన హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రైతులు, ఇతర వర్గాల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన నియోజకవర్గం హిందూపురంను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ విషయంలో సీఎం జగన్ ను కలిసి మాట్లాడతానని చెప్పారు. ఆయన ఈ విషయంలో ఇంతకుముందు సీఎం జగన్ కు లేఖ కూడా రాశారు.

ఇక, స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ... హిందూపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని, మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని బాలకృష్ణ ఈ సందర్భంగా ఆరోపించారు. ఇప్పటికే హిందూపురంకు ఐదుగురు మున్సిపల్ కమిషనర్లు మారారని వివరించారు. ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అన్నారు.