Sydney: సిడ్నీ టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట.... స్మిత్ సెంచరీ, రాణించిన జడేజా

  • ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 338 ఆలౌట్
  • స్టీవ్ స్మిత్ 131 పరుగులు
  • జడేజాకు 4 వికెట్లు
  • రెండో రోజు ఆట చివరికి భారత్ 96/2
  • అర్ధసెంచరీ నమోదు చేసిన గిల్
Sydney test second day play details

సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఓవర్ నైట్ స్కోరు 166/2 తో ఇవాళ తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (131) చాన్నాళ్ల తర్వాత సెంచరీతో మెరిశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆట చివరికి 2 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. క్రీజులో ఛటేశ్వర్ పుజారా (9), కెప్టెన్ అజింక్యా రహానే (5) ఉన్నారు.

యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ మరోసారి ఆకట్టుకులానే బ్యాటింగ్ చేసి అర్ధసెంచరీ సాధించాడు. గిల్ 50 పరుగులు చేసి కమ్మిన్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దాదాపు ఏడాది తర్వాత టెస్టులో ఆడుతున్న సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ  26 పరుగులు చేసి హేజెల్ వుడ్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అయితే, పుజారా-రహానే జోడీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడింది. భారత్ ఇంకా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 242 పరుగులు వెనుకబడి ఉంది.

ఇవాళ్టి ఉదయం ఆటలో టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించి 62 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. బుమ్రాకు 2 వికెట్లు దక్కగా, కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న నవదీప్ సైనీ 2 వికెట్లు చేజిక్కించుకున్నాడు. సిరాజ్ కు ఓ వికెట్ లభించగా, రవిచంద్రన్ అశ్విన్ కు ఒక్క వికెట్టూ పడలేదు.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో మాజీ సారథి స్టీవ్ స్మిత్ ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పాలి. భారత బౌలర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్న స్మిత్ బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై సెంచరీ సాధించాడు. స్మిత్ 226 బంతుల్లో 131 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. జడేజా విసిరిన అద్భుతమైన త్రోకు స్మిత్ బలయ్యాడు. స్మిత్ స్కోరులో 16 బౌండరీలు ఉన్నాయి.

అంతకుముందు, మార్నస్ లబుషేన్ (91) విశేషంగా రాణించినా, దురదృష్టవశాత్తు సెంచరీకి 9 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. చివర్లో స్టార్క్ ఓ సిక్స్, 2 ఫోర్లతో 24 పరుగులు చేశాడు.

More Telugu News