తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన సునీతా లక్ష్మారెడ్డి

08-01-2021 Fri 13:30
  • స‌భ్యులుగా కుమ్ర ఈశ్వరీబాయి, ఉమాదేవి యాదవ్‌, గద్దల పద్మ
  • సహీనా అఫ్రోజ్‌, సుదాం లక్ష్మి, కటారి రేవతీరావు కూడా
  • స‌భ్యుల‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్ష‌లు  
sunita takes oath as woman commision chair person

తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఇటీవ‌లే మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ను నియమించిన విష‌యం తెలిసిందే. రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఇటీవ‌ల‌ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మెదక్‌ జిల్లాకు చెందిన సునీతా లక్ష్మారెడ్డిని చైర్‌పర్సన్ గా  నియమిస్తూ తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇవ్వ‌డంతో ఈ రోజు ఆమె బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

ఆమెతో పాటు ఇందులో మరో ఆరుగురు సభ్యులను కూడా ప్ర‌భుత్వం నియమించింది. కుమ్ర ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్‌, గద్దల పద్మ,  సహీనా అఫ్రోజ్‌, సుదాం లక్ష్మి, కటారి రేవతీరావు ఐదేళ్ల పాటు మహిళా కమిషన్  సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ 2018 జులై నుంచి ఖాళీగా ఉన్న విష‌యం తెలిసిందే.
   
రాష్ట్ర విభజన సమయంలో అప్ప‌టి కాంగ్రెస్‌ ప్రభుత్వం త్రిపురాన వెంకటరత్నంను రాష్ట్ర‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమించడంతో 2018 జులై వ‌ర‌కు ఆమె ఆ బాధ్య‌త‌ల్లో ఉన్నారు. అనంత‌రం మ‌హిళా క‌మిష‌న్ లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తెలంగాణ‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్, సభ్యుల పదవీ స్వీకర‌ణ కార్య‌క్ర‌మం ఈ రోజు బుద్ధ‌భ‌వ‌న్ క‌మిష‌న్ కార్యాల‌యంలో జ‌రిగింది. చైర్‌ప‌ర్స‌న్ సునీతా ల‌క్ష్మారెడ్డితో పాటు మిగ‌తా స‌భ్యుల‌కు మంత్రి కేటీఆర్ పుష్ప‌గుచ్చం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు.