కేసీఆర్ కు భయం పట్టుకుంది: బండి సంజయ్

08-01-2021 Fri 13:20
  • సాగర్ ఉపఎన్నికలో కూడా బీజేపీ గెలుస్తుంది
  • బీజేపీని ఎదుర్కోవడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పని చేస్తాయి
  • ఎన్ని యాగాలు చేసినా కేసీఆర్ చేసిన పాపాలు పోవు
KCR is afraid of Nagarjunasagar bypolls says Bandi Sanjay

తెలంగాణకు పట్టిన వాస్తుదోషం ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ని ఇంటికి సాగనంపితేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో వచ్చిన ఫలితాలే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కూడా వస్తాయని... అందుకే కేసీఆర్ కు భయం పట్టుకుందని  చెప్పారు.

సాగర్ లో బీజేపీని ఎదుర్కోవడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని అన్నారు. సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు.

ఎన్ని యాగాలు చేసినా కేసీఆర్ చేసిన పాపాలు పోవని బండి సంజయ్ అన్నారు. నాగార్జునసాగర్ కు కేసీఆర్ చేసిందేమీ లేదని... సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ను ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. విద్యార్థులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో బీజేపీ పోరాడుతోందని చెప్పారు.

ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ, మోదీ ప్రభంజనం కొనసాగుతోందని, బీజేపీ విజయయాత్ర ఆగేది కాదని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని, అప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తన వ్యక్తిగత స్వార్థంతో 2001లో టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారని  అన్నారు. సినీ నటుడు రాజబాబు కంటే కేసీఆర్ బాగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎం కుర్చీని, సచివాలయాన్ని ఖాళీ చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు.