చైనా ఆటలు సాగనివ్వం.. భారత్​ కే మా మద్దతు: ఫ్రాన్స్​ అధ్యక్షుడి దౌత్య సలహాదారు

08-01-2021 Fri 11:11
  • కశ్మీర్ అంశంపై భారత్ కే మద్దతిచ్చామన్న బోనే 
  • ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని వెల్లడి
  • వ్యూహాత్మక చర్చల కోసం ఇండియాకు వచ్చిన బోనీ
France is not letting China play anti India games at UNSC says Emmanuel Bonne

కశ్మీర్ అంశంపై ఐరాస భద్రతా మండలిలో ఫ్రాన్స్ మద్దతు ఎల్లప్పుడూ భారత్ కే ఉంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ దౌత్య సలహాదారు ఇమ్మాన్యుయేల్ బోనే అన్నారు. ఈ విషయంలో చైనా ‘భారత్ వ్యతిరేక ఆటలు’ సాగనివ్వబోమన్నారు. భారత్– ఫ్రాన్స్ మధ్య జరగనున్న వ్యూహాత్మక చర్చల కోసం ఆయన గురువారం మన దేశానికి వచ్చారు. చర్చల్లో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ఆయన సమావేశమవుతారు.

ఏ విషయంలోనైనా సరే భారత్ కే మద్దతునిస్తామని బోనే చెప్పారు. హిమాలయాల హద్దుల విషయంలోనూ భారత్ వైపే నిలిచామన్నారు. కావాలంటే ఈ విషయంపై గతంలో తాము చేసిన ప్రకటనలను ఓసారి చెక్ చేసుకోవచ్చన్నారు. బహిరంగంగానైనా, ఆంతరంగికంగానైనా తమ మాటలకు కట్టుబడి ఉంటామన్నారు. ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని చెప్పారు.

మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడంలోనూ తాము భారత్ కు సాయం చేశామన్నారు. నిబంధనలను చైనా అతిక్రమిస్తే.. తాము కూడా అంతే దీటుగా, స్పష్టంగా బదులు చెప్తామన్నారు. హిందూ మహాసముద్రంలో తమ నావికాదళాన్ని మోహరించడమే అందుకు నిదర్శనమన్నారు.