సీఎం జగన్ కు రమణ దీక్షితులు విన్నపం

08-01-2021 Fri 10:55
  • తేరు మండపం, వెయ్యి కాళ్ల మండపాన్ని పునర్నిర్మించండి
  • స్వామి వారి భక్తులు సంతోషిస్తారు
  • శ్రీవారి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉండాలి
Ramana Dikshitulu request to Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముందు తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సరికొత్త ప్రతిపాదన పెట్టారు. శ్రీవారి తేరు మండపం, వెయ్యి కాళ్ల మండపాన్ని పునర్నిర్మించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఆయన ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు.

ఈ మండపాలను నిర్మిస్తే వెంకన్న స్వామి భక్తులు సంతోషిస్తారని చెప్పారు. దేవాలయాల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తున్నారని... ఈ శుభసమయంలో ఆయనకు శ్రీవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఆలయాల పునర్నిర్మాణం ఒక చారిత్రాత్మక ఘట్టమని కొనియాడారు.

రమణ దీక్షితులు ఈ విన్నపం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన ఈ డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో వెయ్యి కాళ్ల మండపం కూల్చివేతకు గురైందని చెప్పారు. మరి ఆయన విన్నపం  పట్ల ముఖ్యమంత్రి ఏమేరకు స్పందిస్తారో వేచి చూడాలి.