రాత్రికి రాత్రే పాత్రలు ఎందుకు మారాయి?: ప్రశ్నించిన అఖిలప్రియ సోదరి మౌనిక

08-01-2021 Fri 09:44
  • పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
  • అఖిలప్రియే ప్రత్యక్షంగా కిడ్నాప్‌లో పాల్గొన్నట్టు చిత్రీకరించారని మండిపాటు
  • వివాదాస్పద భూమి తన తండ్రి పేరుపైనే ఉందన్న మౌనిక
Bhuma Akila Priya sister Mounika fires on police over kidnap case

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన తన సోదరి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి పాత్రలు రాత్రికి రాత్రే ఎందుకు మారాయని అఖిలప్రియ సోదరి మౌనిక ప్రశ్నించారు. హైదరాబాద్ పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఎ2గా ఉన్న అఖిలప్రియను ఏ ఆధారాలతో ఎ1గా మార్చారో చెప్పాలని పోలీసులను  ప్రశ్నించారు. తన సోదరి స్పృహతప్పి పడిపోయినా పోలీసులు చోద్యం చూశారు తప్పితే స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

30 మంది పోలీసులు తమ ఇంటికి వచ్చారని, తన సోదరే ప్రత్యక్షంగా కిడ్నాప్ చేసినట్టు ప్రవర్తించారని ఆరోపించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సుబ్బారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వివాదాస్పద భూమి రాష్ట్ర విభజనకు ముందే తన తండ్రి పేరుపై ఉందన్నారు. ఈ కేసులో తమ ప్రమేయం కనుక ఉందంటే దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఈ కేసుతో తన సోదరుడు జగద్విఖ్యాతరెడ్డికి సంబంధం లేకున్నా వేధించారన్నారు. భూ వివాదం విషయంలో ప్రవీణ్‌రావుతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మౌనిక పేర్కొన్నారు.

కాగా, ఈ కేసులో భూమా అఖిలప్రియను తొలుత ఎ2గా పేర్కొన్న పోలీసులు, ఆ తర్వాత ఎ1గా మార్చారు. ఎ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఎ2గా మార్చారు. తొలుత సుబ్బారెడ్డి పరారీలో ఉన్నట్టు పేర్కొన్న పోలీసులు, ఆ తర్వాత కాసేపటికే ఆయనను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. విచారణకు తాను సహకరిస్తానని సుబ్బారెడ్డి హామీ ఇవ్వడంతో వదిలిపెట్టారు. అయితే, అఖిలప్రియను మాత్రం అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు అనుమతితో చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. కిడ్నాప్‌కు ప్రణాళిక రచించిన అఖిల భర్త భార్గవ్‌రామ్‌ కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి.