ఆ ఆరోపణలు నిరూపిస్తే.. మీరు ఉరేసినా సరే.. నన్ను ఉరేసుకోమన్నా సరే, నేను రెడీ: మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ

08-01-2021 Fri 07:06
  • హాట్‌హాట్‌గా పశ్చిమ బెంగాల్ రాజకీయం
  • తనపైకి ఈడీ, సీబీఐలను ఉసిగొల్పాల్సిన అవసరం లేదన్న అభిషేక్ 
  • దిలీప్ ఘోష్  ఓ గూండా
If its proven Im extortionist nephew Ill hang myself

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం హాట్‌హాట్‌గా ఉంది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడమే పరమావధిగా పావులు కదుపుతున్న బీజేపీ.. మమతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఆ పార్టీ నేతలను తమవైపు ఆకర్షించడంలో విజయం సాధించింది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మమతను ఊపిరి సలపకుండా చేస్తున్న బీజేపీ తాజాగా, ఆమె మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేసింది. ఆయనను దోపిడీదారు అల్లుడంటూ ఆరోపణలు గుప్పించింది. తనపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై అభిషేక్ తీవ్రస్థాయిలో స్పందించారు.

దక్షిణ దినాపూర్‌లో నిన్న నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న అభిషేక్ మాట్లాడుతూ.. దోపిడీదారు అల్లుడిగా తనను చిత్రీకరిస్తున్న బీజేపీ నేతలు ఆ ఆరోపణలను నిరూపిస్తే తాను ఉరివేసుకుంటానని అన్నారు. తనపైకి ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి విచారించాల్సిన అవసరం కూడా లేదని, ఆ ఆరోపణలను వారు నిరూపించినా తనను ఉరితీయవచ్చని, లేదంటే తానే ఉరి వేసుకుంటానని సవాలు విసిరారు. బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ బెంగాల్ వ్యక్తి కాదని, ఆయన కుమారుడు ఓ గూండా అని ఆరోపించారు. బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా గూండానే అని ఆరోపించారు.