Elon Musk: జెఫ్ బెజోస్ ను దాటేసి... ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్!

  • మారిన కుబేరుల ర్యాంకులు
  • నిన్న 4.8 శాతం పెరిగిన టెస్లా ఈక్విటీ విలువ
  • బెజోస్ కన్నా 1.5 బిలియన్ డాలర్ల అధిక ఆస్తులు
Elon Musk is Now Number 1 Billioneer in World

ప్రపంచంలోని కుబేరుల జాబితాలో ర్యాంకులు మారాయి. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్, ఇప్పుడు అత్యంత ధనవంతుడిగా మారారు. ఈ క్రమంలో తొలి స్థానంలో ఉన్న అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ను ఆయన కిందకు నెట్టారు.

 గురువారం నాడు టెస్లా సంస్థ ఈక్విటీ విలువ స్టాక్ మార్కెట్ లో 4.8 శాతం పెరగడంతో ఆయన ఆస్తుల విలువ అమాంతం పెరిగిపోయిందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలియజేసింది. సౌతాఫ్రికాలో జన్మించి, విద్యుత్ కార్ల రంగంతో పాటు వాణిజ్య అంతరిక్ష విభాగంలోనూ రాణిస్తూ,  తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న మస్క్, ఆస్తుల విలువ 188.5 బిలియన్ డాలర్లకు పెరిగింది.

జెఫ్ బెజోస్ కన్నా ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ 1.5 బిలియన్ డాలర్లు అధికమని బ్లూమ్ బర్గ్ పేర్కొంది. కాగా, గడచిన ఏడాది వ్యవధిలో మస్క్ ఆస్తుల విలువ గణనీయంగా పెరిగిందన్న సంగతి తెలిసిందే. ఆయన ఆస్తుల విలువ గత సంవత్సరం ఏకంగా 150 బిలియన్ డాలర్లకు పైగా పెరగడం గమనార్హం. ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న భవిష్యత్, దీన్ని ముందుగానే గుర్తించి మరింత మైలేజ్, వేగాన్ని అందించే కార్లను టెస్లా తయారు చేస్తుండటమే ఇందుకు కారణం. ఏడాది వ్యవధిలో టెస్లా కంపెనీ ఈక్విటీ ధర 734 శాతం పెరిగిందంటే, ఆ సంస్థకు మార్కెట్లో ఉన్న విలువను అర్థం చేసుకోవచ్చు.

కాగా, నవంబర్ తరువాత పరిస్థితులు టెస్లాకు అనుకూలంగా మారాయి. డెమోక్రాట్లు జార్జియా సెనెట్ సీట్లను సొంతం చేసుకోవడం, బైడెన్ అధికారంలోకి రావడంతో సాధ్యమైనంత త్వరగా పెట్రోల్, డీజిల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను రీప్లేస్ చేయాలన్న ఆదేశాలు వస్తాయన్న అంచనాలతో టెస్లా విలువ మరింతగా పెరిగింది. ప్రస్తుతం 49 సంవత్సరాల వయసులో ఉన్న మస్క్, భవిష్యత్తులో తన ఆస్తులను మరింతగా పెంచుకుంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News