CS: సీఎం, హోంమంత్రి, డీజీపీ ముందు ప్రజాసేవకులు.. ఆ తర్వాతే క్రైస్తవులు: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్

  • ప్రజాసేవకులకు మతం ఆపాదించడం సరికాదన్న సీఎస్
  • ప్రభుత్వంపై ఆరోపణల పట్ల అభ్యంతరం
  • రాష్ట్రంలో కొత్తగా మత సామరస్య కమిటీలు
  • సీఎస్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి కమిటీ
  • కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు
CS comments on recent developments in state

రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మతసామరస్యం కాపాడేందుకు కమిటీలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రస్థాయి కమిటీకి సీఎస్ నేతృత్వం వహిస్తారు. జిల్లా కమిటీలు కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు, మతసామరస్యం దెబ్బతీసేందుకు పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

వరుస ఘటనల వెనుక లోతైన కుట్ర ఉందని ప్రభుత్వం భావిస్తోందని సీఎస్ వెల్లడించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని.... సీఎం, హోంమంత్రి, డీజీపీ ముందు ప్రజాసేవకులని, ఆ తర్వాతే క్రైస్తవులని స్పష్టం చేశారు. ప్రజాసేవలో ఉన్నవారికి మతం ఆపాదించడం సమంజసం అనిపించుకోదని అభిప్రాయపడ్డారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు శాఖ తన వంతు కృషి చేస్తోందని వివరించారు.

రాష్ట్రంలో మతసామరస్యం పెంపొందించేందుకు కమిటీలు తరచుగా భేటీ అవుతుంటాయని తెలిపారు. రాష్ట్ర కమిటీలో సభ్యులుగా హోం, దేవాదాయ, మైనారిటీ సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులతో పాటు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి కూడా ఉంటారని వివరించారు. అంతేకాకుండా, రాష్ట్ర కమిటీలో సభ్యులుగా అన్ని మతాలకు చెందిన ప్రతినిధులు ఒక్కొక్కరు ఉంటారని సీఎస్ తెలిపారు. ఈ కమిటీలకు ఎలాంటి కాలపరిమితి లేదని పేర్కొన్నారు.

More Telugu News