Raja: వాళ్లను ఎదిరించి చిత్ర పరిశ్రమలో కొనసాగలేకపోయాను: నటుడు రాజా

  • ఆనంద్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాజా
  • కొన్ని సినిమాలతోనే కెరీర్ ఆపేసిన వైనం
  • కొందరు నిర్మాతలతో గొడవలు జరిగాయని వెల్లడి
  • తన సినిమాలకు థియేటర్లు దొరకలేదన్న రాజా
  • ప్రస్తుతం పాస్టర్ గా కొనసాగుతున్న రాజా
Tollywood actor Raja reveals his experiences in industry

ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ కొన్ని సినిమాలతోనే కెరీర్ ఆపేసిన నటుడు రాజా. 'ఓ చినదాన' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఆనంద్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆ నలుగురు, అర్జున్, మాయాబజార్ వంటి చిత్రాలతో అలరించారు. అయితే, ఇండస్ట్రీలో ఎదురైన కొన్ని అనుభవాలతో నటనకు స్వస్తి పలికి, క్రైస్తవ మతబోధన ఎంచుకున్నారు. ప్రస్తుతం పాస్టర్ గా క్రీస్తు బోధనలను ప్రజల్లోకి తీసుకెళుతున్న రాజా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో రిసెప్షనిస్టుగా పనిచేశానని వెల్లడించారు. సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో అనేక అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నానని తెలిపారు. కనీసం చేతిలో వంద రూపాయలు కూడా లేని పరిస్థితుల్లో ఇక జీవితం చాలిద్దామన్న ఆలోచన కూడా వచ్చిందని వివరించారు. అయితే, ఆ ఆలోచన విరమించుకుని ఏదైనా సాధించాలని గట్టిగా నిర్ణయించుకున్నానని, ఆ సమయంలోనే శేఖర్ కమ్ముల ఆనంద్ ప్రాజెక్టులో అవకాశం వచ్చిందని తెలిపారు.

కొన్ని సినిమాల వరకు తన కెరీర్ సజావుగానే సాగిందని, ఆ తర్వాత తన సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఎదురైందని వెల్లడించారు. దాంతో కొందరు పెద్ద నిర్మాతలతో గొడవలు కూడా జరిగాయని, కానీ తన వెనుక ఎవరూ లేకపోవడంతో వారిని ఎదిరించి చిత్ర పరిశ్రమలో కొనసాగలేకపోయానని రాజా విచారం వ్యక్తం చేశారు. ఇక సినిమాలు వదిలేయాలని నిర్ణయించుకుని క్రైస్తవ మతబోధనలో ప్రవేశించానని తెలిపారు.

కాగా, రాజాకు 2014లో వివాహం జరిగింది. అమృతతో రాజా వివాహం క్రైస్తవ మతసంప్రదాయాల ప్రకారం జరిగింది. రాజా, అమృత జంటకు లియారా అనే కుమార్తె ఉంది. కాగా, రాజాకు బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు అక్కలే అన్నీ అయి పెంచారు.

More Telugu News