సంక్రాంతి కానుకగా 'వకీల్ సాబ్' టీజర్... ముహూర్తం ఖరారు

07-01-2021 Thu 18:28
  • పవన్ ప్రధాన పాత్రలో 'వకీల్ సాబ్'
  • నెట్టింట సందడి చేస్తున్న 'వకీల్ సాబ్' విశేషాలు
  • జనవరి 14 సాయంత్రం టీజర్ విడుదల
  • వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చిత్రం
Vakeel Saab teaser set to storm on Sankranthi

పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో వస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్ డేట్ అయినా సరే అభిమానులకు పెద్ద ట్రీట్ లా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' యూనిట్ పవర్ స్టార్ అభిమానులకు సంక్రాంతి కానుక ఇవ్వదలిచింది. జనవరి 14న సాయంత్రం 6.03 గంటలకు 'వకీల్ సాబ్' టీజర్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. వీటికి వస్తున్న స్పందన అంతాఇంతా కాదు. ఇక మరికొన్ని రోజుల్లో రాబోయే టీజర్ వీటిని మించిన స్పందన అందుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బాలీవుడ్ లో వచ్చిన 'పింక్' చిత్రాన్ని 'వకీల్ సాబ్' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'పింక్' లో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను పవన్ 'వకీల్ సాబ్' లో చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. కథలో కీలకమైన పాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.