ఇప్పుడు హిందుత్వం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు అప్పుడెందుకు గుళ్లను కూల్చారు?: రోజా

07-01-2021 Thu 18:14
  • చంద్రబాబు దేవుళ్లతో రాజకీయం చేస్తున్నాడని వ్యాఖ్యలు
  • మరింత పతనం తప్పదని వెల్లడి
  • గతంలో గుళ్లను కూల్చి ఈస్థాయికి పడిపోయారని విమర్శలు
  • సీఎంకు మతం అంటగట్టాలని చూస్తున్నారని ఆగ్రహం
Roja fires on Chandrababu over temples demolition

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన హయాంలో ఆలయాలు కూల్చినందుకే చంద్రబాబు నేడు ఇంతగా పతనం అయ్యారని విమర్శించారు. ఇప్పుడు దేవుళ్లతో రాజకీయం చేస్తున్నారని, ఆయన మరింత పతనం కావడం తథ్యమని హెచ్చరించారు. గతంలో వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చారని, విజయవాడలో ఆలయాలను కూల్చేశారని ఆరోపించారు. బుద్ధిలేకుండా ఇవాళ మతరాజకీయాలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. అయ్యప్పమాల వేస్తే మద్యం ఆదాయం తగ్గిపోతుందన్న వ్యక్తి చంద్రబాబు అని రోజా వ్యాఖ్యానించారు.

డీజీపీ మతం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు, తన హయాంలో సీపీగా నియమించుకోలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడున్న అధికారులంతా చంద్రబాబు హయాంలోనివారేనని, సీఎం జగనేమీ కొత్తగా తీసుకురాలేదని రోజా వివరించారు. సీఎం జగన్ కు కుల, మత పక్షపాత ధోరణులు అంటగట్టాలని చూస్తున్నారని, కానీ అన్నిమతాలకు చెందిన వ్యక్తి సీఎం జగన్ అని ఉద్ఘాటించారు. హిందుత్వం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు తన హయాంలో ఎందుకు గుళ్లను కూల్చివేశారో చెప్పాలని రోజా నిలదీశారు.