మాకు అనుమతి ఇస్తే జగన్ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటి?: సోము వీర్రాజు

07-01-2021 Thu 15:10
  • చంద్రబాబు, విజయసాయిరెడ్డిలకు అనుమతి ఇచ్చారు
  • మాకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు
  • ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మా పోరాటం ఆగదు
Why govt has not giving permission to got to Rama Theertham asks Somu Veerraju

ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రామతీర్థంకు వెళ్లేందుకు చంద్రబాబు, విజయసాయిరెడ్డికి అనుమతి ఇచ్చారని... తమకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. రామతీర్థంకు తమను అనుమతిస్తే జగన్ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు. తమపై పోలీసులతో దమనకాండ చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు.

రాముడికి అపకారం జరిగితే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులకు జగన్, పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రామతీర్థంకు తమను అనుమతించాలని అన్నారు. ఆలయాలపై ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.

కాగా, రామతీర్థంకు వెళ్తున్న సందర్భంగా సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులతో జరిగిన తోపులాటలో సోము వీర్రాజు సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.