గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్

07-01-2021 Thu 13:52
  • దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కులో కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా హాజరైన అజయ్ దేవగణ్
  • ఎంపీ సంతోష్ తో కలిసి మొక్కలు నాటిన అజయ్ దేవగణ్
  • ఎంపీకి అభినందనలు తెలిపిన నటుడు
Bollywood actor Ajay Devgan participates Green India Challenge

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోషకుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ పర్యావరణ హిత కార్యక్రమం దిగ్విజయంగా సాగిపోతోంది. సెలబ్రిటీల నుంచి విశేష స్పందన అందుకుంటున్న ఈ కార్యక్రమంలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఇవాళ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అజయ్ దేవగణ్ ఇక్కడి ఇండస్ట్రియల్ పార్కులో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఇండస్ట్రియల్ పార్కు అధికారులు పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహణ సందర్భంగా దండు మల్కాపూర్ గ్రామం నుంచి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు వరకు కళాకారులు సాంస్కృతిక కళారూపాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. తాము ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్నందుకు ఎంపీ సంతోష్ కుమార్ నటుడు అజయ్ దేవగణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా, ఎంతో మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నారంటూ అజయ్ దేవగణ్ ఎంపీని అభనందించారు.