అమెరికాలో ప్రజాస్వామ్యంపై దాడి ఆందోళనకరం: చంద్రబాబు

07-01-2021 Thu 13:33
  • అమెరికాలో క్యాపిటల్ బిల్డింగ్ వద్ద హింస
  • ట్రంప్ మద్దతుదారుల ఆందోళనలు
  • పోలీసుల కాల్పుల్లో మహిళ మృతి
  • ప్రజాస్వామ్యం దాడిని ఖండించాల్సిందేనన్న చంద్రబాబు
Chandrababu comments on US Capital Building violence

అమెరికాలో క్యాపిటల్ బిల్డింగ్ వద్ద చెలరేగిన హింసాత్మక ఘటనలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. వాషింగ్టన్ డీసీలో హింస చోటుచేసుకుందన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రజాసామ్యంపై ఏవిధమైన దాడి జరిగినా అది తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలు ఈ విపత్కర పరిస్థితిని అధిగమిస్తాయని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని తనకు గట్టి నమ్మకం ఉందని చంద్రబాబు ట్వీట్ చేశారు.

అమెరికాలో  తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు ఇవాళ కాంగ్రెస్ సభ్యులు క్యాపిటల్ బిల్డింగ్ లో సమావేశం కాగా.... ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఆందోళనలకు యత్నించారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందింది.