ఎవరూ చూడట్లేదట... 'సామ్ జామ్'కు శుభం కార్డు!

07-01-2021 Thu 12:57
  • తొలుత 10 ఎపిసోడ్లకు ప్లాన్
  • టీవీలో రాకుండా కేవలం ఓటీటీపై మాత్రమే
  • 8 ఎపిసోడ్లకే పరిమితం
Sam Jam Show End

తెలుగు బుల్లితెరపై అక్కినేని వారి కోడలు, అందాల నటి సమంత తొలిసారిగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో. అదే 'సామ్ జామ్'. ఈ పేరు, తొలి ట్రయిలర్ విడుదల కాగానే అంచనాలు ఎంతో పెరిగాయి. కానీ, షో ప్రారంభమైన తరువాత ప్రేక్షకుల నుంచి అంత స్పందన రాలేదు. ఇది టీవీ చానెల్స్ లో ప్రసారం కాకపోవడం, కేవలం ఓటీటీ ప్లాట్ ఫామ్ గా ఉన్న 'ఆహా'లో మాత్రమే విడుదల అవుతుండటంతో దీనికి వీక్షకుల నుంచి అతి తక్కువ స్పందన వచ్చినట్టు సమాచారం. దీంతో కార్యక్రమాన్ని ముందుగా అనుకున్నన్ని ఎపిసోడ్లు కాకుండా, ముందుగానే ముగించేశారు.

తొలి సీజన్ లో మొత్తం పది షోలను చిత్రీకరించాలని నిర్మాతలు కేవలం ఎనిమిది షోలతోనే ముగించారు. చివరి సీజన్ లో సమంత భర్త నాగ చైతన్య ఇంటర్వ్యూ వచ్చింది. అంతకుముందు అల్లు అర్జున్ తో వచ్చిన ఎపిసోడ్ సైతం తీవ్ర నిరాశ పరిచిందని రేటింగ్స్ తెలుపుతున్నాయి.

ఇక ఈ షో కేవలం యూట్యూబ్ లోని చానెళ్లు, సినిమా వార్తలు రాసుకునే వెబ్ సైట్లకు కొన్ని వార్తలను ఇచ్చిందే తప్ప, తెలుగు సినీ, టీవీ  ప్రేక్షకులను అలరించలేదని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, ఈ షోను చేసేందుకు ఒప్పుకున్న సమంత మాత్రం రెమ్యునరేషన్ రూపంలో తృప్తికరంగానే లబ్దిపొందిందని తెలుస్తోంది.