జగన్ పై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది: సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

07-01-2021 Thu 12:47
  • జగన్ క్రిస్టియన్ అని ఎలా చెపుతారు
  • తిరుమల వెంకన్నకి జగన్ పూజలు చేశారు
  • పూర్వ వైభవం సాధించేందుకు చంద్రబాబు హిందుత్వను వాడుకుంటున్నారు
Chandrababus conspiracy is behind allegations on Jagan says Subrahmanian Swamy

ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. వీటికి సంబంధించి జాతీయ మీడియాలో సైతం చర్చ జరగడం ప్రారంభమైంది. తాజాగా ఓ జాతీయ న్యూస్ ఛానల్ 'న్యూస్ ఎక్స్'తో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ క్రిస్టియన్ అని పలువురు ఆరోపిస్తున్నారని... జగన్ ఎలా క్రిస్టియన్ అవుతారో తనకు అర్థం కావడం లేదని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. గతంలో ఒక రోజు తెల్లవారుజామున 2 గంటలకే తిరుమల వేంకటేశ్వరస్వామి పూజలో జగన్ పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని క్రిస్టియన్ అని ఎలా చెప్పగలమని అన్నారు. జగన్ క్రిస్టియన్ అని ఎవరైనా ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ఈ ఆరోపణల వెనుక చంద్రబాబు కుట్ర దాగుందని చెప్పారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన చంద్రబాబు ఘోర ఓటమిని మూటకట్టుకున్నారని... ఈ నేపథ్యంలో, మళ్లీ పూర్వవైభవం సాధించేందుకు ఆయన కుట్రలు చేస్తున్నారని అన్నారు. హిందుత్వను వేదికగా చేసుకుంటున్నారని విమర్శించారు.

టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్)తో ఆడిట్ చేయించాలనే గొప్ప నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని స్వామి చెప్పారు. ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని కితాబిచ్చారు. ఆలయాలపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేశారో? లేదో? పోలీసులను అడిగితే వారే చెపుతారని అన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను కూడా ఈ విషయంపై అడగొద్దని చెప్పారు. ఈ అంశంపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమేనని అన్నారు.