ఇదో దొంగ తెలివి... షాకింగ్ కలిగిస్తూ, వైరల్ అయిన వీడియో ఇదిగో!

07-01-2021 Thu 12:32
  • ఆపివున్న కారులో దొంగతనం
  • డ్రైవర్ దిగేముందే వెనుక డోర్ తీసిన దొంగ
  • ఆపై తన పని కానిచ్చేసుకున్న చొర శిఖామణి
Theft in Car Video Goes Viral in Internet

పార్కింగ్ చేయబడి, సెంట్రల్ లాక్ వేసివున్న కారులో నుంచి, ఎవరికీ ఏ మాత్రమూ అనుమానం రాకుండా ఓ దొంగ తన పనితనాన్ని ఎంచక్కా ప్రదర్శించాడు. ఆ కారును పార్కింగ్ చేసిన సమయం నుంచి, కారులో దొంగతనం జరిగే వరకూ జరిగిన ఘటనల వీడియో ఫుటేజ్, వైరల్ కాగా, పలు రకాల కామెంట్లు వస్తున్నాయి.

ఇక ఈ వీడియో ఎప్పుడు తీశారన్న సంగతి తెలియరాలేదు గానీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఇక్కడ జరిగిందేమిటంటే.. ఓ వ్యక్తి తన కారును పార్క్ చేశాడు. కారు దిగుతూనే సెంట్రల్ లాక్ వేసుకుంటూ, అక్కడి నుంచి తన పని చూసుకునేందుకు వెళ్లాడు. అదే క్షణంలో ఓ యువకుడు వచ్చి, కారు వెనుక డోర్ ను కాస్తంత తెరిచాడు. దాన్ని అలాగే వదిలేసి అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయాడు.

సెంట్రల్ లాక్ చేసిన యజమాని, వెనుక డోర్ సంగతేంటన్న విషయాన్ని చూసుకోలేదు. ఆపై కారు యజమాని వెళ్లిపోయిన నిమిషాల తరువాత, సదరు చోరుడు చక్కా వచ్చి, తాను ముందుగానే తెరచివుంచిన డోర్ ద్వారా కారు లోపలికి ఎక్కాడు. కారులోని ఓ బ్యాగ్ ను తీసుకుని పక్కనే ఉన్న మరో డోర్ నుంచి కిందకు దిగి చక్కా వెళ్లిపోయాడు. ఈ వీడియోను చూసిన వారంతా ఆ దొంగ తెలివికి మెచ్చుకుంటూనే, కారు దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.