Donald Trump: ప్రజాస్వామ్యానికి తూట్లు... అమెరికాలో ముగిసిన ట్రంప్ శకం!

  • ఊడ్చుకుపోయిన ట్రంప్ పై ఉన్న కొద్దిపాటి అభిమానం
  • సోషల్ మీడియాలో నిరసనల వర్షం
  • యూఎస్ చరిత్రలో మరచిపోలేని ఘటనని వర్ణన  
  • ప్రణాళిక ప్రకారమే ఘటనంటున్న నెటిజన్లు
End for Trump Era in USA

అమెరికాలో అధ్యక్షుడిగా డొనాల్డ్ జాన్ ట్రంప్ శకం ముగిసినట్టే. తాను ఓడిపోలేదని, అక్రమంగా ఓడించారని ఆయన గత రెండు నెలలుగా ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని కోర్టులను ఆశ్రయించినా ఎక్కడా ఉపశమనం పొందకపోగా, ఏదో ఒకమూల కొందరిలో ఆయనపై ఉన్న అభిమానం నేడు జరిగిన ఘటనలతో ఊడ్చుకుపోయింది. అమెరికా చరిత్రలో ఎన్నడూ జరగనట్టుగా క్యాపిటల్ బిల్డింగ్ (మనకు పార్లమెంట్ వంటిది)పై జరిగిన దాడి, దానికి ట్రంప్ మద్దతు పలకడం, ఆపై పోలీసుల కాల్పులు తదితరాలు ఎన్నో ఏళ్లు గుర్తిండి పోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యూఎస్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతానికి ఉన్న ట్రంప్, ఏ క్షణమైనా బాధ్యతలను వీడాల్సిందేనని, లేకుంటే, యూఎస్ చరిత్రలో ఘోరమైన అవమానాలను ఎదుర్కోవాల్సి వుంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. వాషింగ్టన్ లో నేడు జరిగిన ఘటనలను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ ప్రముఖంగా చూపుతుండగా, తమ దేశం పరువు పోయిందని కామెంట్లు వస్తున్నాయి.

అమెరికాలో అత్యంత భద్రత కలిగివుండే ప్రాంతాలు పెంటగాన్, వైట్ హౌస్, క్యాపిటల్ బిల్డింగ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి క్యాపిటల్ బిల్డింగ్ మూడవ అంతస్తు వరకూ నిరసనకారులు వచ్చారంటే, ట్రంప్ ముందుగానే ఓ ప్రణాళిక ప్రకారం ఈ నిరసనలకు దిగాలని తన మద్దతు దారులకు సూచించారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భవనాన్ని కాపాడడానికి తుపాకులను వాడాల్సి వచ్చిందంటే, ట్రంప్ ఎంత దాష్టీకానికి పాల్పడ్డాడోనన్న కామెంట్లూ వస్తున్నాయి.

అమెరికాలో ఎన్నడూ జరగని విధంగా సెనేట్ తో పాటు ప్రతినిధుల సభ సమావేశమైన వేళ నిరసనకారులు దారుణమైన విధ్వంసానికి దిగిన సమయంలో జరిగిన పరిణామాలు ప్రపంచాన్నే నివ్వెర పరిచాయి. ఆది నుంచి రిపబ్లికన్లకు అనుకూలంగా ఉన్న జార్జియా తదితర రాష్ట్రాల్లో డెమొక్రాట్లు ఆధిక్యం సాధించారని ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ట్రంప్ ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఆపై తమకు అయిష్టంగానే ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, సెనెట్ రిపబ్లికన్ నేత మిచ్ మెక్ కొన్నెల్ తదితరులు ట్రంప్ తో కలిసున్నారని, ఆయన వైఖరిపై మండిపడుతున్నారని సమాచారం.

తాజా ఘటనలు ప్రతి ఒక్కరినీ ఆగ్రహానికి గురి చేయగా, ట్రంప్ వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఫాక్స్ న్యూస్ తో మాట్లాడిన వోమింగ్ రిపబ్లికన్ నేత లిజ్ చెన్నీ "ట్రంప్ నిప్పును రాజేశారు. అమెరికా ఇలా మారుతుందని ఎవరూ అనుకోలేదు. అధ్యక్షుడిని నిరసనకారులు ఎన్నుకోలేరు. వారిని ట్రంప్ స్వయంగా ప్రోత్సహించారు" అని మండిపడ్డారు. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటనని, దీన్ని సాధ్యమైనంత త్వరగా మరచిపోయే ప్రయత్నం చేయాల్సి వుందని సీనియర్ రిపబ్లికన్ నేత, మిస్సోరీకి చెందిన సెనెటర్ రాయ్ బ్లంట్ వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా, ట్రంప్ టీమ్ లోని ఒక్కొక్కరూ తమ పదవులకు రాజీనామాలు ఇస్తున్నారు. ట్రంప్ వైఖరిని తప్పుబట్టిన ఆయన కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అల్యసా ఫరాహ్, ఇప్పుడిక తాను దేశం మాటనే వింటానని చెబుతూ, తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. శ్వేతసౌధంలోని చీఫ్ ఆఫ్ స్టాఫ్ మిక్ మిక్ ముల్వానీ సైతం ఇదే విధమైన ప్రకటన చేశారు. తక్షణం ట్రంప్ తన పదవిని వీడి బైడెన్ కు బాధ్యతలు అప్పగిస్తే ఆయనకే మంచిదని వ్యాఖ్యానించారు. జనవరి 20న శాంతియుతంగా అధ్యక్ష బాధ్యతల అప్పగింత కార్యక్రమం జరగాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.

More Telugu News