బోయినపల్లి కిడ్నాప్ కేసు.. ఈ నెల 20 వరకు అఖిలప్రియకు రిమాండ్

07-01-2021 Thu 08:58
  • కేసీఆర్ బంధువులైన ప్రవీణ్‌రావు, ఆయన ఇద్దరు సోదరుల కిడ్నాప్
  • ఏ-2 గా ఉన్న భూమా అఖిలప్రియను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
  • చంచల్‌గూడ మహిళా జైలుకు తరలింపు
Secunderabad Court Remands Bhuma Akhila Priya for January 20th

బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. నిన్న ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్ కోర్టులో ప్రవేశపెట్టగా కేసును విచారించిన న్యాయస్థానం అఖిలప్రియకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను  చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు.

కేసీఆర్ సమీప బంధువులైన ప్రవీణ్‌రావు, ఆయన ఇద్దరు సోదరులు మొన్న రాత్రి కిడ్నాప్ అయ్యారు. బోయిన్‌పల్లిలోని వారి ఇంటికి వెళ్లిన దుండగులు ఐటీ అధికారులమంటూ లోపలికి ప్రవేశించి బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం అర్ధరాత్రి తర్వాత విడిచిపెట్టారు. ఈ కేసులో  ఏ 1 గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2 గా భూమా అఖిలప్రియ, ఏ3 గా భార్గవ్ రామ్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. అనంతరం కూకట్ పల్లిలోని లోథా అపార్ట్ మెంట్స్ సమీపంలో అఖిలప్రియను అరెస్ట్ చేశారు. హఫీజ్‌పేటలోని 25 ఎకరాల  భూమికి సంబంధించిన వివాదమే కిడ్నాప్‌నకు కారణమని తెలుస్తోంది.