టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. వర్షం కారణంగా ఆగిన ఆట

07-01-2021 Thu 06:59
  • జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ
  • ఉమేశ్ యాదవ్ స్థానంలో నవ్‌దీప్ సైనీ
  • 7 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఆగిన ఆట
Rain Stopped Match Siraj Got First Wicket

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో ప్రారంభమైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఇందులో గెలిచిన జట్టుకు సిరీస్‌ను సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత జట్టు మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, ఓటమితో ఆస్ట్రేలియా కసిగా ఉంది.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బరిలోకి దిగుతుండగా, గాయంతో బాధపడుతున్న ఉమేశ్ యాదవ్ స్థానంలో హరియాణా పేసర్ నవ్‌దీప్ సైనీ జట్టులోకి వచ్చాడు. భారత్ తరపున టెస్టుల్లో చోటు దక్కించుకున్న 299వ ఆటగాడిగా సైనీ పేరు రికార్డుల్లోకి ఎక్కింది.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. అప్పటి ఆస్ట్రేలియా 7.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. 6 పరుగుల వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్ అవుటయ్యాడు. సిరాజ్ వేసిన అద్భుత బంతిని ఆడడంలో తడబడిన వార్నర్ (5) పుజారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. విల్ పుకోవ్‌స్కీ (14), లబుషేన్ (2) క్రీజులో ఉన్నారు.