కొత్త సినిమాను వదులుకున్న కాజల్?

06-01-2021 Wed 22:05
  • ఇటీవలే వివాహం చేసుకున్న కథానాయిక కాజల్ 
  • తేజ దర్శకత్వంలో 'అలివేలుమంగ వెంకటరమణ'
  • ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్న ముద్దుగుమ్మ
  • కాజల్ స్థానంలో కథానాయికగా తాప్సి  
Kajal out of Tejas movie

గతంలో దర్శకుడు తేజ రూపొందించిన 'లక్ష్మీకల్యాణం' చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన కథానాయిక కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా వెలుగొంది.. ప్రముఖ హీరోల అందరి సరసన నటించి, అగ్రతారగా రాణించింది. అటు తమిళంలో కూడా పలు సినిమాలు చేసి అక్కడ కూడా సక్సెస్ అయింది. ఇటీవలే వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలు కమిట్ అయినప్పటికీ, తాజాగా తేజ సినిమాను వదులుకున్నట్టు తెలుస్తోంది.

దర్శకుడు తేజ 'అలివేలుమంగ వెంకట రమణ' అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మొదట్లో అలివేలుమంగ క్యారెక్టర్ కి కాజల్ ని ఎంచుకున్నట్టు, చేయడానికి ఆమె కూడా ఒప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, తాజాగా ఆమె వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె స్థానంలో కథానాయిక తాప్సిని తీసుకున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.