గాంధీ ఆసుపత్రిలో కళ్లు తిరిగి పడిపోయిన అఖిలప్రియ

06-01-2021 Wed 21:41
  • కిడ్నాప్ కేసులో అరెస్టయిన అఖిలప్రియ
  • వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు
  • గాంధీ ఆసుపత్రిలో అస్వస్థతకు గురైన వైనం
  • సెలైన్ ఎక్కిస్తున్న ఆసుపత్రి సిబ్బంది
Bhuma Akhila Priya faints at Gandhi Hopsital

కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే కోర్టులో హాజరు పరిచే ముందు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అఖిలప్రియ ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. దాంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అఖిలప్రియకు వైద్యపరీక్షలు చేసిన ఆసుపత్రి సిబ్బంది ఆమెకు సెలైన్ అమర్చారు. పోలీసులు ఆమెను సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు.

ఓ భూ వివాదానికి సంబంధించిన వ్యవహారంలో మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రవీణ్ రావుతో పాటు ఆయన సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో అఖిలప్రియను పోలీసులు ఏ2 నిందితురాలిగా పేర్కొన్నారు. ఆమె భర్త భార్గవరామ్ ను ఏ3గా ప్రకటించారు. ప్రస్తుతం భార్గవరామ్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు జరుపుతున్నారు.