విజయవాడలో వైఎస్ విగ్రహానికి ఇచ్చినంత ప్రాధాన్యత కూడా దేవతా విగ్రహాలకు ఇవ్వడంలేదు: సోము వీర్రాజు

06-01-2021 Wed 18:13
  • ఏపీలో ఇవాళ ధర్నాలు నిర్వహించిన బీజేపీ
  • ప్రజల మనోభావాల గురించి మాట్లాడుతున్నామన్న సోము
  • అది మతతత్వం ఎలా అవుతుందని ఆగ్రహం
  • తాము మౌనంగా ఉండడం జరగని పని అని స్పష్టీకరణ
Somu Veerraju says idols of deities are not given as much importance as idols of YS in Vijayawada
రామతీర్థం ధర్మయాత్రను ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో బీజేపీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. మెజారిటీ ప్రజల మనోభావాల గురించి మాట్లాడితే మతతత్వం అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మతతత్వాన్ని ప్రోత్సహించి చర్చిలు, దర్గాలు కట్టించవచ్చా? అని ప్రశ్నించారు. బీజేపీ నోరు విప్పకూడదని వైసీపీ అనుకుంటోందని, అది జరగని పని అని స్పష్టం చేశారు.

విజయవాడలో వైఎస్ విగ్రహానికి ఇచ్చినంత ప్రాముఖ్యత కూడా దేవతా విగ్రహాలకు ఇవ్వడంలేదని విమర్శించారు. శ్రీశైలం క్షేత్రాన్ని అన్యమతస్థులు నడుపుతున్నారని, వందల ఇళ్లు నిర్మించి అన్యమతస్థులకు ఇస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. తాము రేపు రామతీర్థం వెళుతున్నామని, వైసీపీ, టీడీపీ నేతలకు ఏర్పాట్లు చేసినట్టుగానే తమకు కూడా ఏర్పాట్లు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.