Bowenpally Kidnap Case: మూడు గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించాం... అఖిలప్రియ ఏ2 నిందితురాలు: సీపీ అంజనీకుమార్

  • బోయిన్ పల్లిలో గతరాత్రి ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్
  • కిడ్నాప్ కేసులో నిందితులుగా అఖిలప్రియ దంపతులు
  • అఖిలప్రియను కూకట్ పల్లిలో అరెస్ట్ చేసిన పోలీసులు
  • మిగతా నిందితుల కోసం గాలింపు
  • ప్రెస్ మీట్ లో వివరాలు తెలిపిన సీపీ అంజనీకుమార్
CP Anjanikumar pressmeet over Bowenpally kidnap case

బోయిన్ పల్లిలో ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను హైదరాబాద్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీపీ అంజనీకుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేసు వివరాలు తెలిపారు. కటికనేని మనీశ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బోయిన్ పల్లి కిడ్నాప్ కేసుల వ్యవహారంలో దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. గతరాత్రి బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు, ఆయన ఇద్దరు సోదరుల కిడ్నాప్ జరిగిందని తెలిపారు.

హఫీజ్ పేటలో 25 ఎకరాల భూమికి సంబంధించిన వివాదమే ఈ కిడ్నాప్ కు కారణమని వివరించారు. ఐటీ అధికారుల పేరుతో ప్రవీణ్ రావు ఇంటికి వచ్చారని, నకిలీ ఐడీ కార్డులు చూపించి ఇంట్లోకి ప్రవేశించారని తెలిపారు. ఆపై ప్రవీణ్ రావుతో పాటు ఆయన సోదరులు సునీల్, నవీన్ లను కిడ్నాప్ చేసినట్టు పేర్కొన్నారు. ఇంట్లోని మహిళలను, పిల్లలను ఓ గదిలో బంధించారని చెప్పారు. నిందితులు తమ కార్లకు కూడా నకిలీ నెంబరు ప్లేట్లు ఉపయోగించారని వెల్లడించారు. ఈ అపహరణ కేసులో సీసీ కెమెరా ఫుటేజి కీలకంగా మారిందని, ఫుటేజి సాయంతోనే అరెస్టులు చేయగలిగామని సీపీ చెప్పారు.

కేవలం 3 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించామని పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ కేసులో ఏ1 ఏవీ సుబ్బారెడ్డి, ఏ2 భూమా అఖిలప్రియ, ఏ3 భార్గవరామ్ అని వివరించారు. ఈ ఉదయం 11 గంటలకు అఖిలప్రియను అరెస్ట్ చేశామని తెలిపారు. కూకట్ పల్లిలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అఖిలప్రియకు గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించామని సీపీ వెల్లడించారు. అఖిలప్రియ కుటుంబానికి, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబానికి ముందు నుంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కాగా, కిడ్నాప్ ఘటనలో ఇతరుల ప్రమేయం కూడా ఉన్నట్టు తేలిందని చెప్పారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారని వివరించారు. ఏపీ పోలీసుల సాయంతో మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేస్తామని అన్నారు.

More Telugu News