నీకేం పోయే కాలం వచ్చింది?: బండి సంజయ్ పై అంబటి ఆగ్రహం

06-01-2021 Wed 16:51
  • ఇటీవల తిరుపతి ఉప ఎన్నికపై బండి సంజయ్ స్పందన
  • బైబిల్ పార్టీ, భగవద్గీత పార్టీ అంటూ వ్యాఖ్యలు
  • ఘాటుగా స్పందించిన అంబటి రాంబాబు
  • నీకెం తెలుసని మాట్లాడుతున్నావంటూ మండిపాటు
  • కార్పొరేటర్ స్థాయి నాయకుడంటూ విమర్శలు
Ambati Rambabu slams Bandi Sanjay over his bible party remarks

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఇటీవల బండి సంజయ్ తమ పార్టీని బైబిల్ పార్టీ అని సంబోధించాడని మండిపడ్డారు. బైబిల్ పార్టీకి ఓటేస్తారా? భగవద్గీత పార్టీకి ఓటేస్తారా? అంటున్నావు... నీకేం పోయే కాలం వచ్చింది? అంటూ బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది బైబిల్ పార్టీ మాత్రమే కాదని, భగవద్గీత పార్టీ, ఖురాన్ పార్టీ కూడా అని అంబటి ఉద్ఘాటించారు. ఈ మూడు కలిస్తేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కొన్నిరోజుల కిందట ఏపీ పరిణామాలపై స్పందించారు. తిరుపతి ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బైబిల్ పార్టీ కావాలా? భగవద్గీత పార్టీ కావాలా? అని ఓటర్లను ప్రశ్నించారు. దీనిపైనే అంబటి తన ప్రెస్ మీట్లో స్పందించారు.

"ఎవరో బండి సంజయ్ అట! ఆయన కెపాసిటీ ఏంటో అని ఎంక్వైరీ చేస్తే కార్పొరేటర్ స్థాయి నాయకుడని తెలిసింది. ఇవాళొచ్చి జగన్ మోహన్ రెడ్డి గారిపై వ్యాఖ్యలు చేస్తున్నాడు. బైబిల్ పార్టీ, భగవద్గీత పార్టీ అంటూ పేర్లు పెట్టేశావు... అయినా నీకిదేం బుద్ధి? బైబిల్, భగవద్గీత, ఖురాన్ ఎంతో పవిత్రమైనవి. ఓట్లు సంపాదిద్దామని వాటికి కూడా పార్టీలు పెట్టేశావు. మా పార్టీ అన్ని మతాలతో సంబంధం ఉన్న పార్టీ తప్ప ఒక్క మతంతోనే ప్రమేయం ఉన్న మీ పార్టీ వంటిది కాదు.

అంతేకాదు, రెండు కొండల పార్టీకి ఓటేస్తారా, ఏడుకొండల పార్టీకి ఓటేస్తారా? అంటూ మాట్లాడుతున్నావు... అసలు వాస్తవాలేంటో నీకు తెలుసా? రెండు కొండలు అని చంద్రబాబు అంటే, కాదు ఏడు కొండలు అని రాజశేఖర్ రెడ్డి గారు జీవో ఇచ్చారు. ఈ బండి సంజయ్ ఎవరో కానీ తెలుసుకుని మాట్లాడాలి. కులాలు, మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకునే సంకుచిత పార్టీలకు ఈ రాష్ట్రంలో తావులేదు. ఏదో ఒక రాష్ట్రంలో మతాన్ని అడ్డుపెట్టుకుని గెలిచి ఇక్కడ కూడా అదే చేద్దామనుకుంటే కుదరదు. ఇది ఆంధ్రప్రదేశ్... జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్న రాష్ట్రం. ఇక్కడ మీ ప్రయత్నాలు సాగవు. ధర్మం నాలుగు పాదాలపై నడుస్తున్న రాష్ట్రమిది. అన్ని మతాలు, కులాలను సమానంగా చూసే రాష్ట్రమిది" అంటూ అంబటి రాంబాబు వివరించారు.