Andhra Pradesh: పౌర కేంద్రీకృత సంస్కరణల అమలులో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్!

  • రూ. 172 కోట్లను విడుదల చేశాం
  • అదనపు సాయంగా రూ. 1,004 కోట్లు
  • వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ
Center Reward for AP Rs 344 Crores

కేంద్రం ఇటీవల తీసుకుని వచ్చిన నాలుగు పౌర సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు మూడింటిని విజయవంతంగా అమలు చేస్తున్నాయని ప్రశంసిస్తూ, కేంద్ర ప్రభుత్వం రివార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా ఏపీకి రూ. 344 కోట్లు అందించాలని నిర్ణయించామని, అందులో భాగంగా రూ.172 కోట్లను విడుదల చేశామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

సంస్కరణలను అమలు చేస్తున్నందుకు వివిధ రాష్ట్రాలకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించిన కేంద్రం, అదనంగా మూలధన ఆర్థిక సాయం కింద రూ.1,004 కోట్లను అందించనున్నామని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టింది. వన్ నేషన్ - వన్ రేషన్ కార్డ్ సంస్కరణలతో పాటు, వ్యాపారానికి వెసులుబాటు, అర్బన్, లోకల్ బాడీస్ సంస్కరణలను ఈ రాష్ట్రాలు విజయవంతం చేశాయని ప్రశంసించింది.

మధ్యప్రదేశ్ అమలు చేస్తున్న మూలధన ప్రాజెక్టులకు రూ. 660 కోట్లను అందిస్తున్నామని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణకు ఈ విభాగంలో రూ. 179 కోట్లను ప్రకటించిన కేంద్రం, అందులో రూ. 89.50 కోట్లను విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ. 10,250 కోట్లను కేటాయించిన కేంద్రం, అందులో రూ. 9,879.61 కోట్లను ఆమోదించామని, ఇప్పటివరకూ రూ. 4,939.80 కోట్లను విడుదల చేశామని స్పష్టం చేసింది. ఈ జాబితాలో అత్యధికంగా యూపీకి రూ. 1,501 కోట్లు కేటాయించడం గమనార్హం.

More Telugu News