Kim Jong Un: తప్పులు జరిగాయి.. ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ఘోరంగా విఫలమైంది: కీలక వ్యాఖ్యలు చేసిన కిమ్ జాంగ్ ఉన్

  • నేర్చుకున్న పాఠాలను మరువ వద్దు
  • ఐదేళ్ల తరువాత అధికార పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగం 
  • సమావేశానికి 7 వేల మంది ప్రతినిధుల హాజరు
  • వైఫల్యానికి కారణాలు చెప్పని కిమ్
Kim Jong Admits Mistake in Economic Development Plan

ఉత్తర కొరియాలో ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ఘోరంగా విఫలమైందని, ఈ విషయంలో ప్రభుత్వ విధాన నిర్ణయం తప్పుగా నిలిచిపోయిందని దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం అధికార పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దాదాపు ఐదేళ్ల తరువాత తొలిసారిగా ఇటువంటి సమావేశం జరిగింది. మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీ బాధ్యతలు చేపట్టనున్న వేళ, తన పార్టీని ఉద్దేశించి కిమ్ జాంగ్ ప్రసంగించడం గమనార్హం.

ఉత్తర కొరియా, అమెరికాల మధ్య సత్సంబంధాలు లేవన్న సంగతి తెలిసిందే. కిమ్, ట్రంప్ మధ్య చర్చలు జరిగిన తరువాత కూడా ఫలితాలు సంతృప్తికరంగా రాలేదు. ఉత్తర కొరియాపై ఆంక్షలు కొనసాగుతుండగా, కిమ్ సైతం అమెరికాకు దీటైన సమాధానం ఇచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఈ సంవత్సరం జనవరిలో కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని సరిహద్దులనూ ప్రభుత్వం మూసివేయగా, అప్పటి నుంచి నార్త్ కొరియా మరింత ఒంటరి దేశంగా మిగిలింది. ఈ నేపథ్యంలోనే నార్త్ కొరియా కాంగ్రెస్ సమావేశాలు రాజధానిలో ప్రారంభం అయ్యాయని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజన్సీ పేర్కొంది.

దాదాపు 7 వేల మంది వరకూ ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారని, సమావేశాల్లో ఎవరూ మాస్క్ లు ధరించలేదని అధికారికంగా విడుదలైన చిత్రాలను బట్టి తెలుస్తోంది. సమావేశాల తొలి రోజున తన పనితీరును స్వయంగా సమీక్షించుకున్న కిమ్, గడచిన ఐదేళ్ల ఆర్థికాభివృద్ధి వ్యూహం ఏ లక్ష్యాన్నీ అందుకోలేకపోయిందని, దాదాపు అన్ని విధాలుగా విఫలమైందని వ్యాఖ్యానించారు.

ఈ ప్రణాళికను పూర్తిగా రద్దు చేసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డ ఆయన, తప్పు జరిగిందని అంగీకరించినా, అది ఎక్కడ జరిగిందన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. జరిగిన పరిణామాలను మరింత లోతుగా విశ్లేషించాల్సి వుందని, నేర్చుకున్న పాఠాలను భవిష్యత్తుకు బాటలుగా మార్చుకోవాలని కిమ్ పిలుపునిచ్చారు.

More Telugu News