India: ఇండియాలో భారీగా తగ్గిపోయిన కొత్త కరోనా కేసులు... హెర్డ్ ఇమ్యూనిటీకి సంకేతమా?

  • 17 వేల దిగువకు పడిపోయిన రోజువారీ కేసుల సంఖ్య
  • 2 శాతానికి దిగువకు టెస్ట్ పాజిటివిటీ రేటు
  • హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగిందంటున్న వైద్య నిపుణులు
Test Positivity Rate in India Below 2 Percent

గత సంవత్సరం సెప్టెంబర్ లో ఒక్క రోజులో 97 వేల కరోనా కేసులు నమోదైనప్పటి నుంచి, కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. తాజాగా నిన్న కొత్త కేసుల సంఖ్య 16,375కు పడిపోయింది. దాదాపు ఆరు నెలల తరువాత రోజువారీ కరోనా కేసుల సంఖ్య 17 వేల దిగువకు తగ్గింది. అంటే సెప్టెంబర్ తో పోలిస్తే, కొత్త కేసులు 80 శాతానికి పైగా తగ్గాయి.

దేశంలో కరోనా హాట్ స్పాట్ లుగా ఉన్న పలు ప్రాంతాల్లోని ప్రజల్లో సామూహిక రోగనిరోధకత పెరిగిన కారణంగానే కొత్త కేసులు భారీగా పడిపోయాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో సెప్టెంబర్ తో పోలిస్తే, ఇప్పుడు రోజువారీ నమూనాల సేకరణ, టెస్టింగ్ కాస్తంత తగ్గింది. అయినా నిత్యమూ 8 లక్షలకు పైగా నమూనాలను పరీక్షిస్తూనే ఉన్నామని అధికారులు వెల్లడించారు.

సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రోజుకు 10 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించిన వేళ, పాజిటివిటీ రేటు దాదాపు 11 శాతంగా ఉండేది. కానీ ఇప్పుడు 8 లక్షల పరీక్షలు చేస్తుండగా, పాజిటివిటీ రేటు రెండు శాతానికి దిగువకు పడిపోయింది. భారతీయుల్లో హెర్డ్ ఇమ్యూనిటీ పెరగడమే ఇందుకు కారణం.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం, టెస్ట్ పాజిటివిటీ రేటు 5 శాతానికి పెరిగితే, అక్కడ మహమ్మారి ప్రభావం చాలా అధికంగా ఉన్నట్టు. వైరస్ చాలా వేగంగా విస్తరిస్తున్నట్టు. ఇక ఇండియాలోని రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, కేసులు అత్యధికంగా ఉన్నాయని భావించిన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కొత్త కేసుల సంఖ్య తగ్గిపోయింది.

కనీసం 50 శాతం మంది ప్రజలకు వైరస్ ను ఎదుర్కొనే శక్తి వస్తే, ఆ ప్రాంతంలోని వారికి హెర్డ్ ఇమ్యూనిటీ సులువుగా వచ్చేస్తుంది. ఇప్పుడు అదే కేసుల సంఖ్యను కనిష్ఠానికి చేర్చుతోంది. ప్రస్తుతం దేశంలోని 60 శాతం మందిలో రోగ నిరోధక శక్తి పెరిగిందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News