India: ఇండియాలో మరింతగా పెరిగిన కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు

  • యూకే నుంచి వచ్చిన మరో 20 మందికి కొత్త స్ట్రెయిన్
  • 58కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
  • పరిస్థితిని చాలా క్లోజ్ గా పరిశీలిస్తున్నామన్న కేంద్రం
20 more UK returnees detected with new COVID 19 strain

బ్రిటన్ నుంచి మన దేశంలో అడుగుపెట్టిన కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. యూకే నుంచి వచ్చిన మరో 20 మందిలో కొత్త స్ట్రెయిన్ ను గుర్తించారు. దీంతో, ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 58కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కొత్త స్ట్రెయిన్ బాధితులందరినీ వారి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సింగిల్ రూమ్ ఐసొలేషన్లలో ఉంచినట్టు వెల్లడించింది. వీరితో పాటు విమానంలో ప్రయాణించిన తోటి ప్రయాణికులను, కుటుంబీకులను, కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని ట్రేస్ చేస్తున్నారని చెప్పారు. పరిస్థితిని చాలా క్లోజ్ గా పరిశీలిస్తున్నామని, రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తున్నామని తెలిపింది.

ఇప్పటికే కొత్త స్ట్రెయిన్ యూకే నుంచి అనేక దేశాలకు పాకింది. యూకే నుంచి విమాన రాకపోకలపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. జనవరి 8 నుంచి రాకపోకలను పునఃప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో యూకే నుంచి వచ్చేవారిపై భారత ప్రభుత్వం షరతులు విధించింది. ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టును సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో వారిని దేశంలోకి అనుమతించబోమని చెప్పారు.

మరోవైపు మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,03,56,844కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,31,036 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 1,49,850 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News