కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు

05-01-2021 Tue 15:20
  • జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్
  • తాము కార్పొరేటర్లుగా గెలిచి రోజులు గడుస్తున్నా తమకు విలువ లేదని మండిపాటు
  • పాత కార్పొరేటర్లే ఆధిపత్యం చలాయిస్తున్నారని ఆగ్రహం
BJP corporators protest at Pragathi Bhavan

తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు తాజాగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసి రోజులు గడుస్తున్నా తమను కార్పొరేటర్లుగా గుర్తించడం లేదని... వెంటనే తమను కార్పొరేటర్లుగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో గెలిచినప్పటికీ తమ ప్రాంతాల్లో తాము ఇప్పటికీ ఏ పనులూ చేయలేకపోతున్నామని వారు మండిపడ్డారు. పాత కార్పొరేటర్లే ఇప్పటికీ ఆధిపత్యం చలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న తమకు ఏ మాత్రం విలువ లేకుండా ఉందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్పొరేటర్లు ప్రగతి భవన్ ను ముట్టడించిన సందర్భంగా అక్కడ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.