రామతీర్థం ఘటనను తీవ్రంగా ఖండించిన వీహెచ్‌పీ.. జగన్ ప్రభుత్వ ఉదాసీనతతోనే దాడులంటూ విమర్శలు

05-01-2021 Tue 06:58
  • పరిస్థితి తీవ్రతకు దాడులు అద్దం పడుతున్నాయి
  • నిందితులపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు
  • అన్ని ఆలయాలకు రక్షణ కల్పించాలి
VHP Fires on jagan govt on attacks on temples
ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) స్పందించింది.  విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనను తీవ్రంగా ఖండించిన వీహెచ్‌పీ.. జగన్ ప్రభుత్వ ఉదాసీనతే ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులకు పాల్పడిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ నేపథ్యంలో వీటికి వ్యతిరేకంగా పిలుపునివ్వడం తప్ప మరో మార్గం కనిపించలేదని పేర్కొంది. దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలన్నింటికీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. రెండు రోజుల వ్యవధిలో మూడు ఆలయాలపై దాడులు జరగడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేసింది. దేవాలయాల పరిరక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించలేకపోతున్నట్టు కనిపిస్తోందని వీహెచ్‌పీ విమర్శించింది.