కార్పొరేట్ వ్యవసాయంలోకి ప్రవేశించం.. రైతుల భూములు కూడా కొనుగోలు చేయం: రిలయన్స్ కీలక ప్రకటన

04-01-2021 Mon 20:11
  • రైతుల నుంచి నేరుగా పంటను కొనుగోలు చేయం
  • మా సరఫరాదారులు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తారు
  • మా సెల్ టవర్ల విధ్వంసం వెనుక విదేశీ శక్తులు ఉన్నాయి
Will never enter into corporate agriculture says Reliance

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో మోహరించిన రైతులు తమ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ చట్టాల వల్ల అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకే మేలు జరుగుతుందని, రైతులు నాశనం అవుతారని వారు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక ప్రకటన చేసింది. కార్పొరేట్ వ్యవసాయం లేదా కాంట్రాక్ట్ వ్యవసాయంలోకి తాము ప్రవేశించబోమని స్పష్టం చేసింది. రైతుల నుంచి వ్యవసాయ భూములను కొనుగోలు చేసే ఆలోచన కూడా తమకు లేదని వెల్లడించింది.

రైతుల నుంచి తాము నేరుగా పంటను కొనుగోలు చేయబోమని... తమ సరఫరాదారులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తారని రిలయన్స్ తెలిపింది. రైతులకు వారి పంటకు లాభదాయకమైన ధర లభించాలనేదే రిలయన్స్, దాని సంబంధిత సంస్థల అభిమతమని చెప్పింది. కనీస మద్దతు ధరకు కట్టుబడి ఉండాలని తమ సరఫరాదారులను కూడా కోరుతున్నామని తెలిపింది. పంజాబ్, హర్యానాల్లో రిలయన్స్ సెల్ టవర్ల విధ్వంసం వెనుక విదేశీ శక్తులతో పాటు, తమ వ్యాపార శత్రువులు కూడా ఉన్నట్టు భావిస్తున్నామని చెప్పింది.