Krishna Ella: కొన్ని భారతీయ కంపెనీలు మాపై దుష్ప్రచారం చేస్తున్నాయి: భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల

  • కొవాగ్జిన్ కు డీసీజీఐ అనుమతి
  • మీడియా ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన కృష్ణ ఎల్ల
  • రాజకీయనేతలు కూడా తమపై విమర్శలు చేస్తున్నారని వెల్లడి
  • తమ కుటుంబానికి ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టీకరణ
Bharat Biotech CMD Krishna Ella press meet

తొలి దేశీయ కరోనా వ్యాక్సిన్ గా పేరుగాంచిన కొవాగ్జిన్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల మీడియా సమావేశం నిర్వహించారు. కొన్ని భారతీయ కంపెనీలు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

కొందరు రాజకీయనేతలు సైతం తమ వ్యాక్సిన్ పై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. తమ కుటుంబానికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. వదంతుల ద్వారా దేశీయ కంపెనీలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని కృష్ణ ఎల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వ్యాక్సిన్ కొవాగ్జిన్ కు సంబంధించిన డేటాలో పారదర్శకత లేదన్నది పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు.

ప్రపంచంలో బీఎస్ఎల్-3 ప్రమాణాలతో కూడిన ఉత్పత్తి సామర్థ్యం తమకు మాత్రమే ఉందని ఉద్ఘాటించారు. బీఎస్ఎల్-3 ఉత్పత్తి సామర్థ్యం అమెరికా కంపెనీల వద్ద కూడా లేదని అన్నారు. ప్రస్తుతం తమ వద్ద 20 మిలియన్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయని, 700 మిలియన్ల డోసుల తయారీ తమ లక్ష్యమని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్య అత్యయిక పరిస్థితి వచ్చినా సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత్ బయోటెక్ అధినేత వెల్లడించారు. తానేమీ రాజకీయ నాయకుడ్ని కాదని, డబ్బు కంటే తమకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని అన్నారు.

More Telugu News