Gudivada: గుడివాడలో పేకాటకు సంబంధించి కీలక ప్రకటన చేసిన కృష్ణా జిల్లా ఎస్పీ

  • పేకాట ఆడుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది
  • ఎస్ఈబీ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు
  • రూ. 55.39 లక్షలు స్వాధీనం చేసుకున్నాం
Krishna district SPs response on Gudivada playing cards incident

కృష్ణా జిల్లా గుడివాడలో ఓ పేకాట స్థావరం పై పోలీసులు జరిపిన దాడి రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఆ స్థావరాన్ని నిర్వహిస్తున్నది మంత్రి కొడాలి నాని అనే ఆరోపణలు వచ్చాయి. అయితే, తనకు, దానికి ఎలాంటి సంబంధం లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు కీలక ప్రకటన చేశారు.

తమిరిశలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం వచ్చిందని... వెంటనే ఎస్ఈబీ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారని ఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో 33 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. రూ. 55.39 లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 28 కార్లు, 13 బైకులను స్వాధీనం చేసుకుని, 33 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు.

పొట్లూరు మురళి అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ పేకాట శిబిరం నడుస్తోందని ఎస్పీ తెలిపారు. మూడు గంటల పాటు కొనసాగిన దాడులను వీడియో తీశామని చెప్పారు. గత వారం రోజుల్లో దాదాపు 100 పేకాట శిబిరాలపై దాడులు చేశామని... అయితే, ఈ దాడి మాత్రమే హైలైట్ అయిందని అన్నారు. రాజకీయ నాయకులు చేసే ఆరోపణలపై తాము స్పందించబోమని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలు, పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News