Justice JK Maheshwari: జస్టిస్ జేకే మహేశ్వరికి అమరావతిలో ఘనంగా వీడ్కోలు... ట్రాక్టర్లతో పువ్వులు తెచ్చి రోడ్లపై చల్లిన రైతులు

  • సిక్కిం హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ జేకే మహేశ్వరి
  • ఏపీ హైకోర్టులో వీడ్కోలు కార్యక్రమం
  • దుఃఖంతో మాటలు రాక మౌనం దాల్చిన మహేశ్వరి
  • ఘనంగా వీడ్కోలు చెప్పిన రాజధాని రైతులు, మహిళలు
Grand sendoff for Justice JK Maheshwari in AP High Court

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీపై సిక్కిం హైకోర్టు సీజేగా వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అమరావతిలో ఘనంగా వీడ్కోలు పలికారు. జస్టిస్ మహేశ్వరికి రాజధాని రైతులు, మహిళలు వీడ్కోలు చెప్పారు. ఆయన వాహనం ప్రయాణించినంత మేర రోడ్డుపై పువ్వులు పరిచి, రోడ్డుకిరువైపులా నిలబడి తమ అభిమానం ప్రదర్శించారు. ట్రాక్టర్ల నిండా పువ్వులు తీసుకువచ్చిన రైతులు కిలోమీటర్ల మేర రోడ్డుపై చల్లారు.

కాగా, వీడ్కోలు ప్రసంగంలో జస్టిస్ జేకే మహేశ్వరి భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపు మాటలు రాక మౌనం దాల్చారు. కొన్నిసార్లు ఉద్వేగంతో ఆయన గొంతు వణికింది. "నిష్క్రమణ అనేది ఎల్లప్పుడూ బాధాకరమే. నేనిప్పుడు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతున్నాను. సోదర, సోదరీమణుల్లాంటి జడ్జిలు, న్యాయ వ్యవస్థ ఉద్యోగులు నా హృదయంలో చెరగని ముద్రవేశారు. ఈ అభిమానాన్ని, ప్రేమను నా మనసులో, నా హృదయంలో ఉంచుకుంటాను. నా విధి నిర్వహణలో ఎలాంటి తప్పు అయినా చేసుంటే దయచేసి నన్ను క్షమించండి" అంటూ వీడ్కోలు సందేశం వినిపించారు.

తాను చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చానని, కష్టపడి ఈ స్థాయికి ఎదిగానని జస్టిస్ జేకే మహేశ్వరి తెలిపారు. ఇప్పటివరకైతే సమర్థంగా విధులు నిర్వర్తించాననే భావిస్తున్నానని, అయితే తాను ఈ సన్మానానికి అర్హుడ్ని అవునో కాదో తెలియదని పేర్కొన్నారు. చివరగా ఓ సంస్కృత శ్లోకంతో తన ప్రసంగాన్ని ముగించారు. "సర్వే భవంతు సుఖనా, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యన్తు, మాకశ్చి దుఃఖ మాప్నుయాత్" అంటూ అందరూ సంతోషంగా ఉండాలన్న తన ఆకాంక్షను వెలిబుచ్చారు. 

More Telugu News