Nimmala Rama Naidu: అప్పట్లో చిన్నవిషయానికే బోండా ఉమ, కేశినేని నానిలను చంద్రబాబు క్షమాపణ చెప్పమన్నారు: నిమ్మల రామానాయుడు

Nimmala Ramanaidu comments on AP Ministers language
  • ఏపీ మంత్రుల భాషపై రామానాయుడు వ్యాఖ్యలు
  • ఆటవిక భాష అని విమర్శలు
  • మన నోటితో అనలేని మాటలవి 
  • అశోక్ గజపతిరాజుపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆరోపణ
ఏపీ మంత్రులు మాట్లాడుతున్న భాషపై టీడీపీ నేత నిమ్మల రామానాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజు వంటి నీతినిజాయతీ ఉన్న వ్యక్తి గురించి వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరు ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. వేల ఎకరాలు మాన్సాప్ ట్రస్టు ద్వారా పేద ప్రజలకు విద్యా, వైద్య సౌకర్యాల కోసం ఇచ్చేసిన మహనీయ కుటుంబానికి చెందిన వ్యక్తి, సింహాచలం దేవస్థానం కోసం వేల ఎకరాలు ఇచ్చేసిన రాజకుటుంబానికి చెందిన వ్యక్తి అని అశోక్ గజపతిరాజును కీర్తించారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో పార్లమెంటులో ప్రభుత్వ సొమ్ముతో ఒక కప్పు కాఫీ తాగడానికి కూడా ఇష్టపడని వ్యక్తి అని వివరించారు.

అలాంటి అశోక్ గజపతిరాజు గురించి, ఆయన కుటుంబం గురించి ఇవాళ మంత్రులు ఇష్టానుసారం ఆటవికంగా మాట్లాడుతున్నారని, వాళ్లు మాట్లాడుతున్న మాటలను మళ్లీ మనం అనలేని విధంగా ఉంటాయని తెలిపారు. గతంలో ఓసారి ఓ కమిషనర్ విషయంలో బోండా ఉమ, కేశినేని నాని చిన్న వ్యాఖ్య చేస్తేనే చంద్రబాబునాయుడు ఒప్పుకోలేదని, వెంటనే ఆ కమిషనర్ వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పాలని బోండా ఉమ, కేశినేని నానిలకు స్పష్టం చేశారని వివరించారు.

కానీ సీఎం జగన్ కు మాత్రం తమ మంత్రులు మాట్లాడే భాష ఎంతో హాయిగా ఉంటుందని, మంత్రులు కూడా జగన్ ను ఆనందింపచేయడానికి తమ శక్తిమేర బూతులు మాట్లాడుతుంటారని నిమ్మల రామానాయుడు విమర్శించారు. అసెంబ్లీలో కూడా తమ మంత్రులు మాట్లాడే భాషను జగన్ ఆస్వాదిస్తుంటారని, వారు మాట్లాడే బూతులు వింటూ రిలాక్స్ అవుతూ నవ్వుకుంటుంటారని దెప్పిపొడిచారు.

అశోక్ గజపతిరాజును ఉద్దేశించి వెల్లంపల్లి నోట వచ్చిన ఆ మాటలు జగన్ హృదయంలోంచి వచ్చిన మాటలని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్న జగన్ పై గవర్నర్ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Nimmala Rama Naidu
Telugudesam
YSRCP
Ministers
Language
Ashok Gajapathi Raju
Ramatheertham
Andhra Pradesh

More Telugu News